పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో కశ్మీర్లో ముష్కరులు అమాయకులపై దాడి చేసిన వైనం కలవరపాటుకు గురిచేసింది. కశ్మీర్ అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా టెర్రరిస్టులు పాశవికంగా జరిపిన ఈ దాడిలో 30 మంది చనిపోయారు.
ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. ఆటగాళ్లు, అంపైర్లు నేటి మ్యాచ్‌లో నలుపు రిబ్బన్లను ధరించనున్నారు. అంతేకాదు, ఈ మ్యాచ్ సందర్భంగా చీర్ లీడర్స్ ఉండకూడదని నిర్ణయించారు.
ఇక పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో బిజెపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ 3 రోజుల సంతాప దినాలను పాటించాలని జనసేన నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంతో పాటు పలు జిల్లాలలోని జనసేన కార్యాలయాలలో జెండాలను అవనతం చేసి సంతాపం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates