ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.సీతారామాంజనేయులు అరెస్టు కావడానికి తహతహలాడిపోయారా? అంటే… సీఐడీ అధికారుల విచారణలో ఆయన సమాధానం వింటే మాత్రం అవుననే చెప్పాలి. అరెస్టు అయ్యేందుకు ఆయన అమితాసక్తి చూపారట. తన కోసం ఏపీ పోలీసులు వస్తారని, తనను అరెస్టు చేస్తారని ముందే తనకు తెలుసునని… అరెస్టు అయ్యాక ఓ సారి జైలుకు వెళ్లి వద్దామని భావించానని పీఎస్ఆర్ చెప్పారట. ఒకసారి లోపలికి వెళ్లి వద్దామనుకున్నానని కూడా ఆయన పోలీసులతో చెప్పారట. నిజంగా పీఎస్ఆర్ నోట నుంచి ఈ మాటలు విన్నంతనే సీఐడీ అధికారులు షాక్ కు గురయ్యారట.
ఐపీఎస్ అధికారిగా పీఎస్ఆర్ కు ఓ రేంజి ట్రాక్ రికార్డు ఉంది. ఏఎస్పీ స్థాయి నుంచి ఆయనది దూకుడుతత్వమే. జిల్లాల ఎస్పీగా ఆయన చూపించిన పోలీస్ పవర్ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇక విజయవాడ నరగ పోలీస్ కమిషనర్ గా ఆయన ఏ మేర స్వైరవిహారం చేశారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి దూకుడు వైఖరిని పీఎస్ఆర్ ఇప్పటికీ వదలలేదనే చెప్పాలి. ఎంత పెద్ద విషయాన్ని అయినా చాలా టేకిట్ ఈజీగా భావించే తత్వాన్ని పీఎస్ఆర్ ఇంకా వదలలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. మంగళవారం పోలీసులు అరెస్టు చేసి విజయవాడ తరలించినప్పుడు కూడా పీఎస్ఆర్ పెద్దగా కలత చెందినట్టుగానో, తనను అరెస్ట్ చేశారే అన్న భావనకు ఆయన గురి అయినట్లుగా కనిపించలేదు. చలాకీగా, అలా నవ్వుతూ సాగిన పీఎస్ఆర్ తీరు ఆసక్తి రేకెత్తించింది.
ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించిన తర్వాత సీఐడీ అదికారులు పీఎస్ఆర్ ను ఏకంగా 7 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా పీఎస్ఆర్ తనకు తెలియదని, గుర్తు లేదని, జెత్వానీ ఎవరో కూడా తనకు తెలియదని, అలాంటి వారి గురించి ఆలోచించే సమయం తనకు ఎక్కడిదని కూడా ఆయన సమాధానాలిచ్చారట. అయితే ఈ మధ్యే ఆమె గురించి తెలుసుకున్నానని, ఆమెపై తనకు సదభిప్రాయం లేదని తెలిపారట. ఈ సందర్భంగా ”అరెస్టు చేయడానికి మీరు వస్తారని వారం ముందే నాకు తెలుసు. అరెస్టు చేస్తే ఓ సారి లోపలికి వెళ్లి వద్దామనుకున్నా. అందుకే ముందస్తు బెయిల్ కూ వెళ్లలేదు” అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. అంతేకాకుండా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నింపాదిగా ఆన్సర్లు ఇచ్చిన పీఎస్ఆర్ ఏమాత్రం కంగారు పడిన దాఖలానే కనిపించలేదట.
విచారణలో భాగంగా తన ఈజీ గోయింగ్ ప్రదర్శించిన పీఎస్ఆర్… తనలోని వైరాగ్యాన్ని కూడా బయటపెట్టుకున్నారట. ప్రాప్తి ఉంటే అన్నీ వస్తాయన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న సమయంలో మధ్యలో స్నాక్స్ తీసుకున్న పీఎస్ఆర్… రాత్రికి సీఐడీ కార్యాలయంలోనే బస చేయాల్సి వచ్చింది. విచారణ ముగిసే సరికి బాగా ఆలస్యం కావడంతో సీఐడీ అధికారులు ఆయనను బుధవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో రాత్రి భోజనం కింద పీఎస్ఆర్ ఇడ్లీ మాత్రమే తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే…ఈ కేసులో పీఎస్ఆర్ తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలు ఉన్నారు. అయితే వారిద్దరూ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పీఎస్ఆర్ ఈ దిశగా సాగకపోవడం గమనార్హం.