ఏపీ బీజేపీ చీఫ్‌గా మార్పు ఖాయమని సంకేతాలు అందుతున్నాయి. ఈ నెలలోనే మార్పు తప్పదన్న మాటా వినిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు కూడా ప్రారంభం అవుతోంది. ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్‌ను నిమిషాల వ్యవధిలోనే పక్కన పెట్టారు. తమకు అవకాశం.. అవసరం పెరిగిన నేపథ్యంలో బీజేపీ ఇలాంటి మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.త్వరలోనే మూడు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయస్థాయిలో బీజేపీ చీఫ్‌ను కూడా మారుస్తున్నారు.
అప్పుడు ఒకేసారి.. ఏపీలోనూ మార్పు దిశగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఈ పదవిని తనకే కొనసాగించాలని ప్రస్తుత చీఫ్ పురందేశ్వరి కోరుతున్నా.. ఇతర ప్రయోజనాల కారణంగా.. ఆమె అభ్యర్థనను బీజేపీ నాయకులు లైట్ తీసుకుంటున్నారని తెలిసింది. దీనికి తోడు సోము వీర్రాజు ను ఎమ్మెల్సీ చేయడంలో.. ఆమె వెనుకంజ వేయడం పట్ల ఆయన ఆర్ ఎస్ ఎస్‌కు ఫిర్యాదు చేయడం కూడా.. మైనస్‌గా మారింది. ఇక, గతంలోనూ పురందేశ్వరికి వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
పైగా.. పార్టీని యాక్టివ్‌గా ముందుకు నడిపించేందుకు కూడా ఆమె ఉత్సాహం చూపట్లేదని అంటున్నారు. ఈ క్రమంలో మార్పు తప్పదన్న అభిప్రాయం ఖాయమైంది. దీంతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి.. పేరు ప్రముఖంగా తెరమీదికి వచ్చింది. ఇటు సోషల్ మీడియా సహా.. ప్రధాన మీడియాల్లోనూ ఆయన పేరు వినిపిస్తుండడం గమనార్హం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఉన్న సుజనా.. 2014కు ముందు రాజకీయాల బట్టారు.
వస్తున్నా మీకోసం పేరుతో చంద్రబాబు నిర్వహించిన యాత్రకు.. ఆయన ఫండింగ్ చేశారు.ఆ తర్వాత.. రాజ్యసభ సభ్యుడిగా.. కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అప్పట్లోనే కేంద్ర మంత్రులతో కలివిడిగా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇది ఇప్పుడు ఆయనకు కలిసి వస్తోందని అంటున్నారు. సుజనా అయితే.. అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా కూడా.. కలిసి వచ్చే అవకాశం ఉంటుందని.. అందుకే ఆయన వైపు బీజేపీ మొగ్గు చూపుతోందన్న చర్చ కూడా జరుగుతుండడం గమనార్హం.