మొన్నటి ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ విచారణ జోరు పెంచింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీడీపీ తరపున పులివర్తి నాని పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో చెవిరెడ్డి ఘన విజయం సాధించారు. అయితే అన్నీచోట్లా పోలింగ్ ప్రశాంతంగా ఏడుచోట్ల వైసీపీ రిగ్గింగుకు పాల్పడిందని టీడీపీ అభ్యర్ధి ఆరోపించారు. అదే సమయంలో ఎస్సీ, బీసీలను బెదిరించి టీడీపీ నేతలే రిగ్గింగుకు పాల్పడినట్లు చెవిరెడ్డి కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
సరే అన్నీ విషయాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగుకు ఆదేశించారు. తర్వాత అక్కడ కూడా ఎన్నికలు ప్రశాంతంగానే అయిపోయింది. టీడీపీ అక్రమాలకు పాల్పడినట్లుగా తన ఆరోపణలకు తగ్గట్లుగా చెవిరెడ్డి వీడియో సీసీ ఫుటేజీలను కూడా అప్పట్లోనే అందించారు. అప్పట్లో చెవిరెడ్డి చేసిన ఆరోపణలపై ఇఫుడు ఎన్నికల కమీషన్ విచారణ మొదలుపెట్టింది.
నాలుగు రోజుల క్రితమే విచారణ మొదలుపెట్టిన ఉన్నతాధికారి శ్రీధర పోలింగ్ ఫుటేజీలను పరిశీలించారు. అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న 25 మంది రౌడీషీటర్లు చెవిరెడ్డి ఆరోపించిన పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగుకు పాల్పడినట్లు విచారణాధికారి గుర్తించారు. పోలీసుల అదుపులో ఉండాల్సిన రౌడీషీటర్లు పోలింగు కేంద్రాల్లో ఎలా ఉన్నారన్నదే ఇక్కడ కీలకమైంది. దీనికి ముందు పోలీసు అధికారులు తర్వాత పోలింగ్ అధికారులే సమాధానం చెప్పాలి.
ఇదే సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నపైన కూడా వైసీపీ నేతలు తీవ్రమైన ఫిర్యాదులు చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రద్యుమ్నపైన కూడా వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు అవసరమైన ఆధారాలను విచారాణిధికారి శ్రీధర్ సంపాదించినట్లు సమాచారం. సరే విచారణ తర్వాత ఎవరిపై ఎటువంటి చర్యలకు శ్రీధర్ సిఫారసు చేస్తారన్నది వేరే విషయం. అధికారులను ముందుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన నేతలపై కేసులు పెట్టే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.
ఎందుకంటే తెరవెనకున్న నేతలెప్పుడు కనబడరు. కాకపోతే వాళ్ళు చెప్పినటల్లా విన్న అధికారులే తెరమీద కనబడుతారు. ఇపుడు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగింది కూడా ఇదే. ఇందులో పోలీసు, రెవిన్యు అధికారుల పాత్రే స్పష్టంగా కనబడుతోందట. మరి ఎవరిపైన ఎటువంటి చర్యలుంటాయో చూడాల్సిందే. పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చినా అధికారులు తమ జాగ్రత్తల్లో ఉండకపోతే ఇలంటి చిక్కులే వస్తాయి.