రాష్ట్రానికి ఎంతో ప్రధానమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాజకీయ దెబ్బపడింది. ప్రాజెక్టు ఖరదీను భరించటంలో కేంద్ర ప్రభత్వం తీసుకున్న యూటర్న్ వల్లే నిధుల వివాదం మొదలైందన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు హయాంలో ప్రాజెక్టకు సవరించిన అంచనా ప్రకారం రూ. 55 వేల కోట్లకు అంగీకరించింది కేంద్రమే. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వత సవరించిన అంచనాల పేరుతో రూ. 47 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపితే అంగీకరించిందీ కేంద్రమే. అలాంటిది హఠాత్తుగా 2014 అంచనాల ప్రకారం రూ. 20 వేల కోట్లకే కేంద్రం కట్టుబడుందని చెప్పటంలో అర్ధమేంటి ?
ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఇందుకు రాజకీయ కారణాలు తప్ప మరోటి కనబడటం లేదు. నిజానికి ఈ ప్రాజెక్టు దశాబ్దాలుగా నత్తనడక నడుస్తోందనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టు పరుగులు మొదలుపెట్టింది. ప్రాజెక్టు కాల్వలను తవ్వించింది వైఎస్సారే. అలాంటిది వైఎస్సార్ హఠాన్మరణంతో ప్రాజెక్టు పనులుమళ్ళీ మొదటికే వచ్చింది. తర్వాత రాష్ట్ర విభజన కారణంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. అంటే విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతంతా కేంద్రానిదే. కానీ 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం నుండి తీసుకున్న తర్వాత మళ్ళీ పనులు ఊపందుకున్నాయి.
2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్లో జోరు కంటిన్యు అయ్యింది. 2021 జూన్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా కరోనా వైరస్ దెబ్బతో పనులు నెమ్మదించాయి. తర్వాత మళ్ళీ ఊపందుకుంటోందనే సమయానికి విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కేంద్రం వైఖరి కారణంగా వివాదం మొదలైంది. ఈ ప్రాజెక్టులో చాలా కాలంగా రాజకీయ వివాదాలే నడుస్తున్నాయి. ప్రాజెక్టును పూర్తి చేస్తే జగన్ కే మంచిపేరొస్తుంది కానీ నిధులిచ్చిన కేంద్రానికి వచ్చేదేమీ లేదు. పేరుకు జాతీయ ప్రాజెక్టే అయినా, నిధులంతా కేంద్రానిదే అయినా పర్యవేక్షణ అంతా రాష్ట్రానిదే కాబట్టి, ప్రొజెక్టయ్యేది కూడా ముఖ్యమంత్రే.
అందుకనే ప్రాజెక్టుకు నిధుల విషయంలో కేంద్రం అర్ధాంతరంగా మెలికలు పెడుతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇదే విధమైన సమస్య తమిళనాడు లాంటి రాష్ట్రంలో తలెత్తుంటే పరిస్దితి ఇంకో విధంగా ఉండేదనటంలో సందేహం లేదు. తమిళనాడు, కేరళ, కర్నాటక లాంటి చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు రాష్ట్రప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి. అధికారం కోసం తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా రాష్ట్రప్రయోజనాల విషయంలో ఏకమైపోతాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది పరిస్ధితి. దీన్నే కేంద్రం బాగా అడ్వాంటేజిగా తీసుకుంటోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే పోలవరానికి నిధుల సమస్యకన్నా రాజకీయ కారణాలే అసలైన అడ్డంకిగా మారినట్లు అర్ధమైపోతోంది.