కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓకే చెప్పగా… బిల్లుకు వ్యతిరేకంగా 232 మంది ఓటేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపినట్లు ఓం బిర్లా ప్రకటించారు.
చాలా రోజుల క్రితమే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రతిపాదించగా… అందులోని కొన్ని అంశాలపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయగా… బిల్లు సవరణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని కేంద్రం నియమించింది. ఈ క్రమంలో దఫ దఫాలుగా జేపీసీ భేటీలు నిర్వహించి…బిల్లుకు ఆయా పార్టీలు సూచించిన పలు మార్పులను అంగీకరించింది. ఇందులో టీడీపీ ప్రతిపాదించిన నాలుగు మార్పుల్లో మూడింటికి అనుమతి లభించగా… ఓ మార్పునకు ఆమోదం లభించలేదు.
వక్ఫ్ సవరణ బిల్లుకు అదికార పక్షానికి చెందిన ఎన్డీఏ పక్షాలన్నీ అనుకూలంగానే ఓటేశాయి. లోక్ సభలో ఎలాగూ ఎన్డీఏకు విస్పష్ట మెజారిటీ ఉన్న నేపథ్యంలో వక్ఫ్ బిల్లుకు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే మొన్నటిదాకా ఎన్డీఏకు అనుకూలంగా సాగిన వైసీపీ… ఈ దఫా మాత్రం ఎన్డీఏకు వ్యతిరేకంగా సాగింది. వక్ఫ్ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఓటేసింది. దీంతో బీజేపీకి ఆ పార్టీ వ్యతిరేకంగా తన ప్రయాణాన్ని ప్రారంభించినట్టైంది.