మోడీకి 75 ఏళ్లు.. రంగంలోకి ఆర్ ఎస్ ఎస్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబ‌రు 17తో 75 ఏళ్లు వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. మ‌రో 5 నెల‌ల్లో ఆయ‌న 75వ ప‌డిలోకి అడుగు పెట్ట‌నున్నారు. అయితే.. దీనిలో త‌ప్పేముంది? అనే ప్ర‌శ్న వ‌స్తుంది. కాలంతోపాటు వ‌య‌సు కూడా పెరుగుతుండ‌డం స‌హ‌జం. అయితే.. ఆర్ ఎస్ ఎస్, బీజేపీ సిద్ధాంతాల ప్ర‌కారం.. 75 ఏళ్లు నిండిన‌, లేదా వ‌చ్చిన వ్య‌క్తులు కీల‌క ప‌ద‌వుల్లో ఉండ‌రాద‌న్న సూత్రం ఒక‌టి ఉంది. దీనికిక‌ట్టుబ‌డే.. గ‌త రెండు టెర్మ్‌ల‌లోనూ.. చాలా మంది కీల‌క నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌లేదు. వారికి ఇదే కార‌ణంగా కూడా చూపించారు.

ఇప్పుడు ఇదే వ‌యో ప‌రిమితి అంశం.. ప్ర‌దాని న‌రేంద్ర మోడీ విష‌యంలోనూ తెర‌మీదికి వ‌చ్చింది. వ‌రుస విజ‌యాల‌తో బీజేపీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన ఘ‌న‌త, కూట‌ములు క‌ట్టి బీజేపీ ప్రాభ‌వాన్ని దిగ్విజ‌యంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘ‌న‌త కూడా ఆయ‌న‌కు సొంతం. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానం కూడా లేదు. అంతేకాదు.. మోడీ త‌ర్వాత‌..ఎవ‌రు? అనే ప్ర‌శ్న వ‌స్తే.. ప్ర‌స్తుతం ఉన్న స్థితిలో దిక్కులు చూసే ప‌రిస్థితి కూడా ఉంది. అలా.. బీజేపీని అధికారంలోకి తీసుకువ‌చ్చి.. కాంగ్రెస్ ను అట్ట‌ర్ ఫ్లాప్ చేయ‌డంలో మోడీ స‌క్సెస్ అయ్యారు. మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. దాదాపు 25 సంవ‌త్స‌రాలుగా ఆయ‌న ప‌ద‌వుల్లోనే ఉన్నారు.

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మూడు సార్లు ప‌నిచేశారు. త‌ర్వాత‌.. దేశ‌ప్ర‌ధాని అయ్యారు. ఎక్క‌డా గ్యాప్‌ లేకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఎలాంటి అడ్డంకులు లేక‌పోయినా.. ఇప్పుడు వ‌య‌సు మాత్రం అడ్డంకిగా మారింది. దీనిని దాటుకుని ముందుకు సాగాల‌ని చాలా మంది మోడీ అనుకూల నాయ‌కుల‌కు ఉన్న‌ప్ప‌టికీ.. ప‌దే ప‌దే సిద్ధాంత రాద్ధాంతాల‌ను తెర‌మీదికి తీసుకువ‌చ్చే ఆర్ ఎస్ ఎస్ మాత్రం ఈ విష‌యంలో ఒకింత వైముఖ్యంగానే ఉంద‌ని చెప్పాలి.తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్‌లో ఉన్న ఆర్ ఎస్ ఎస్ కేంద్ర‌కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన మోడీ.. ఈ విష‌యంపై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

అలాగ‌ని.. ఇప్ప‌టికిప్పుడు ఆర్ ఎస్ ఎస్ త‌న సిద్ధాంతాల‌ను మార్చుకుంటుందా? ఆర్ ఎస్ ఎస్ మాన‌స‌పుత్రిక‌గా.. సైద్ధాంతిక క‌ర్త‌గా ఉన్న బీజేపీ త‌న రూటు మార్చుకుని వ‌యో ప‌రిమితి విష‌యంలో మోడీకి ప్ర‌త్యేక స‌డ‌లింపు ఇస్తుందా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఐదు మాసాల్లో కేంద్రంలో కీల‌క మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ ఇప్పుడిప్పుడే రాజుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మోడీ అంత స‌ర్వ‌శ‌క్తి మంతుడు ఎవ‌రూ క‌నిపించ‌క‌పోయినా.. స‌మ తూగ‌ల నాయ‌కులు ఒకరిద్ద‌రు ఉన్నారు. వీరిలో నితిన్ గ‌డ్క‌రీ, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, కేంద్ర మంత్రి అమిత్ షా క‌నిపిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.