హైడ్రా పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్య

హైడ్రా పేరు వింటేనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు కీలక నగరాల జనం హడలిపోతున్నారు. ఈ ఆందోళనలు కూడా కేవలం పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి మాత్రమే వినిపిస్తున్నాయి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ సాగుతున్న సంపన్నులకు హైడ్రాలోనూ మినహాయిపులు దక్కిపోతున్నాయి. మొత్తంగా పేదలు, మధ్య తరగతిని మాత్రమే టార్గెట్ గా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతున్న హైద్రా… ధనవంతుల జోలికే వెళ్లడం లేదు. ఈ మాటలన్నది కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకులో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటే గిట్టని వారో కాదు. తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

హైదరాబాద్ లోని మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రాజేంద్ర నగర్ తహశీల్దార్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలని, లేదంటే తామే తొలగించాల్సి వస్తుందని సదరు నోటీసుల్లో తహశీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నోటీసులను నిలుపుదల చేయాలంటూ అక్కడి వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవార హకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగానే హైడ్రా తీరును తప్పుబడుతూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు రాష్ట్రంలో ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా? అంటూ హైకోర్టు హైడ్రాను నిలదీసింది. ఒక్కో వర్గానికి ఒక్కో రూలు అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలాగంటూ తలంటింది.

ఇప్పటిదాకా హైడ్రా చేపట్టిన కూల్చివేతలను పరిశీలిస్తే… ఆ సంస్థకు పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే టార్గెట్ గా ఉన్నారని భావించాల్సి ఉందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్య చేసింది. పేదల నిర్మాణాలపై దృష్టి సారిస్తున్న హైడ్రా… నిబంధనలను ఇష్టారాజ్యంగా అతిక్రమించి వెలసిన సంపన్నుల నిర్మాణాలు కనిపించడం లేదా? అని కోర్టు ప్రశ్నించింది. నిబంధనలు పక్కాగా పాటించామని చెప్పుకోవాలంటే… పేదలతో పాటు పెద్దల నిర్మాణాలపై ఒకే తరహా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అభిప్రాపడింది. అప్పుడే హైడ్రా హుందాతనం కూడా నిలబడుతుందని వ్యాఖ్యానించింది. మియాపూర్, దుర్గం చెరువు పరిసరాల్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందని కూడా హైకోర్టు నిలదీసింది.