టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవలి కాలంలో తరచూ ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు…కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పెద్దలతో వరుస భేటీలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏలో కీలక బాగస్వామిగా టీడీపీ కొనసాగుతున్నందున…ఏపీ కోసం చంద్రబాబు ఏం అడిగినా… ఇట్టే వచ్చి పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరోమారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారన్న మాట విన్నంతనే… ఆ టూర్ పై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహం ఈ నెల 18న ఢిల్లీలో జరుగుతోందట. ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకే డిల్లీ వెళుతున్న చంద్రబాబు పనిలో పనిగా ఈ టూర్ లో అంందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆయా శాఖల వద్ద ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయించే దిశగా చంద్రబాబు కృషి చేయనున్నారు. ఇందులో భాగంగా వీలయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… ఓ ముఖ్యమైన పని కోసం త్వరలోనే ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు ఇటీవలే ప్లాన్ చేసుకున్నారు. ఆ పనిని ఈ టూర్ లోనే ముగిస్తే సరిపోలా అన్న దిశగానూ చంద్రబాబు సాగుతున్నట్లు సమాచారం. అదేంటంటే.. రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు దాదాపుగా కార్యరంగం సిద్ధమైపోయింది. ఈ పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమరావతి పనుల ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రదానితో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.