వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఇప్పుడప్పుడే జైలు నుంచి విముక్తి కలిగేలా లేదు. ఇప్పటికే నాలుగు కోర్టుల నుంచి బెయిల్ లభించడంతో బుధవారం పోసాని రిలీజ్ అవుతారని అంతా అనుకున్నా.. బుధవారం ఉదయం ఊహించని రీతిలో ఏపీ సీఐడీ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఫలితంగా కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సిన పోసాని… బుధవారం మధ్యాహ్నంలోగా సీఐడీ పోలీసుల అదుపులోకి వెళ్లనున్నారు. వెరసి పోసాని రిలీజ్ ఇప్పుడప్పుడే ఉండదని చెప్పక తప్పదు. పోసానికి నాలుగు కేసుల్లో బెయిల్ రాగా…మరో నాలుగు కేసుల్లో పోసానిని అరెస్ట్ చేయకుండా స్టేట్ మెంట్లు రికార్డు చేయాలని హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే పోసానిపై మొత్తంగా 16 కేసులు నమోదు అయి ఉన్నాయి కదా. మిగిలిన కేసుల్లో ఏదో ఒకటి ఓపెన్ అయిపోతూనే ఉంటుంది. ఫలితంగా పోసాని మరింత కాలం పాటు జైలులోనే ఉండక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబాలపైనా అసభ్య పదజాలంతో కూడిన దూషణలకు దిగారంటూ పోసానిపై ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 16 దాకా పోలీసు కేసులు నమోదు అయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదు అయిన కేసులో రాజంపేట పోలీసులు గత నెల హైదరాబాద్ కు వెళ్లి మరీ పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను కోర్టు రిమాండ్ కు ఆదేశించగా… పోలీసులు రాజంపేట జైలుకు తరలించారు. అక్కడికి వచ్చిన నరసరావు పేట పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. ఆపై గుంటూరు జైలుకు వెళ్లిన పోసానిని ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకుని కర్నూలు జైలుకు తరలించారు.
ఈ కేసుల్లో ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని, విజయవాడ కోర్టుల్లోనూ ఆయనకు బెయిళ్లు మంజూరయ్యాయి. దీంతో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని… కోర్టు నిర్దేశించిన మేరకు జామీనులు సమర్పించి బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని మంగళవారం రాత్రి పలు కథనాలు వినిపించాయి. అనారోగ్యంతో సతమతం అవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పోసానికి ఎట్టకేలకు కాస్త ఊరట లభించిందన్న వాదనలు వినిపించాయి.
అయితే ఊహించని విధంగా గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరిన సీఐడీ అధికారులు బుధవారం ఉదయానికంతా కర్నూలు జిల్లా జైలు వద్ద ప్రత్యక్షమయ్యారు. పోసానిపై వారు పీటీ వారెంట్ ను జైలు అధికారులకు అందజేశారు. అంతేకాకుండా జైలు నుంచే పోసానిని కర్నూలు జిల్లా కోర్టులో వర్చువల్ గా హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేశారు. అంటే… వర్చువల్ గా జైలు నుంచే పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్న సీఐడీ అధికారులు.. కోర్టు అనుమతితో పీటీ వారెంట్ పై తమ అదుపులోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆయనను గుంటూరు తరలించే అవకాశాలున్నట్లు సమాచారం.