వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్.. 30 ఏళ్లపాటు తనదే పీఠం అని మురిసిపోయారు. ప్రచారం చేసుకున్నారు. కానీ, ప్రజలు తలుచుకుంటే ఏం జరుగుతుందో అదే చూపించారు. తద్వారా.. పాలనలో ఆయన విఫలమయ్యారన్న సంకేతాలు వచ్చాయి. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడి పోయిన దరిమిలా.. తన పాలన అద్భుతమని చెప్పుకొనే పరిస్థితి జగన్‌కు లేకుండా పోయింది. అంటే.. పాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. సంక్షేమ రాజ్యం తెచ్చామని ఆయన చెప్పుకొన్నా.. అది సాకారం కాలేదు. పైగా ఏపీ అభివృద్ధికి ఆమడదూరం జరిగిపోయింది.
ఈ విషయంలోనేనా.. జగన్ ఇతర విషయాల్లోనూ విఫలమయ్యారా? ఇదీ.. ఇప్పుడు ఏపీలో ఆసక్తిగా మారిన రాజకీయ చర్చ. దీనికి కారణం.. వైసీపీ నాయకులు అరెస్టు కావడం.. ఆ జిల్లా.. ఈ జిల్లా అని తేడా లేకుండా.. వైసీపీ నేతలను పోలీసులు జైళ్ల చుట్టూ తిప్పుతుండడం.. వీరికి బాసటగా నిలవాల్సిన వైసీపీ అధినేత చెప్పా చేయకుండానే బెంగళూరుకు మకాం మార్చేయడం.. వంటి పరిణామాలు వైసీపీని పూర్తిగా డోలాయమానంలో పడేస్తున్నాయి. నిజానికి తమను అంటిపెట్టుకుని.. తమను సమర్ధించిన నాయకులకు పార్టీలు అండగా ఉంటాయన్న సూత్రం అందరికీ తెలిసిందే.
గతంలో టీడీపీ నాయకులకు ఎంత కష్టం వచ్చినా.. నేనున్నానంటూ చంద్రబాబు లేదా లోకేష్ కదిలేవారు. వారికి న్యాయం జరిగే వరకు అక్కడే ఉండి.. తమ దైన రీతిలో సాయం అందించేవారు. కానీ, ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే.. నాయకులను వదిలేశారన్న చర్చ జరుగుతోంది. తాజాగా పోసాని కృష్ణమురళి కావొచ్చు.. బోరుగడ్డ అనిల్ కుమార్ కావొచ్చు. వల్లభనేని వంశీ కావొచ్చు.. ఇలా.. నాయకులు ఎవరైనా.. కూడా గతంలో వైసీపీని సమర్ధించిన వారే. జగన్‌కు జేజేలు పలికిన వారే. వారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నది ఎందుకు? అంటే.. ఖచ్చితంగా జగన్‌కు జేజేలు పలకబట్టే కదా?!
ఇలాంటి వారికి ఆపత్కాలంలో జగన్ అండ అవసరం అనేది వారి వారి కుటుంబాలు చెబుతున్న మాట. కానీ, ఇలాంటి సమయంలోనూ జగన్ మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నారు. తూతూ.. మంత్రంగానే పరామర్శిస్తున్నారు. అయితే.. ఇక్కడ ఓ సందేహం రావొచ్చు.. తప్పు చేసిన వారిని సమర్ధించడం ఇష్టంలేకే జగన్ ఇలా చేస్తున్నారన్న సందేహం కలుగుతుంది. కానీ, ఆ తప్పులు ఎవరి కోసం చేశారంటే.. పోసాని చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ కోసమే కదా! మరి అలాంటప్పుడు వీరిని ఏదో ఒక విధంగా ఆదుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంది.
కానీ, ఈ విషయాన్ని వదిలేసి తన మానాన తను వెళ్లిపోతే.. జగన్ గురించి ఏమనుకుంటారు? ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. పాలన పరంగానే విఫలమైన జగన్.. ఇప్పుడు తన వారిని.. తన నాయకులను కూడా రక్షించుకునే విషయంలో నాయకుడిగా ఆయన విఫలమవుతున్నారని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తన పార్టీ వారు తప్పులు చేసినా..ఆ తప్పులు జరిగింది తన వల్లే కాబట్టి.. వారిని కాపాడాల్సిన బాధ్యత.. తనపైనే ఉందన్న విషయాన్ని జగన్ వదిలేశారు. ఇదే మున్ముందు కూడా కొనసాగితే.. ఇక, ఆయన చుట్టూ నాయకులు ఎవరూ ఉండరని అంటున్నారు పరిశీలకులు.