వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కీలక సాక్షి, వివేకా ఇంటి వాచ్ మెన్.. రంగన్న మరణం.. వైసీపీని నిలువునా దహించేస్తోంది. తొలుత ఈ మరణాన్ని పోలీసుల ఖాతాలో వేస్తూ.. వైసీపీ అనుకూల మీడియా సహా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే కొందరు రంగంలోకి దిగి.. రంగన్న భార్యతో పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే తన భర్త మృతి చెందాడని స్టేట్‌మెంట్ చెప్పించారు. ఇదేసమయంలో కేసు కూడా పెట్టించారు. అయితే.. ఈ విషయం ఇప్పుడు యూటర్న్ తీసుకుంది.
రంగన్న మృతి.. అనంతర పరిణామాలపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వైసీపీ నేతలు, అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్నితీవ్రంగా భావించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు.. రంగన్న మృతిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని నిర్ణయించారు. దీంతో శుక్రవారమే.. రంగన్న భౌతిక దేహానికి పోస్టు మార్టం ముగిసి.. అంత్యక్రియలు కూడా పూర్తి అయినప్పటికీ.. తిరిగి పార్థివ దేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. రీ పోస్టు మార్టం కోసం మంగళగిరి, తిరుపతి ప్రాంతాల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు కడపలోని భాకారాపేట శ్మశాన వాటికకు వెళ్లి.. మృతదేహాన్ని వెలికి తీసి.. అక్కడే పోస్టు మార్టమ్ చేశారు.
ఈ సమయంలో ఎవరినీ దరిదాపులకు రాకుండా పక్కా భద్రత ఏర్పాటు చేశారు. రంగన్న శరీరంపై ఏమైనా గాయాలు ఉన్నాయా? కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయా? అనే కోణంలో అన్నివైపుల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేశారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. కాగా.. ఈ పరిణామాలతో వైసీపీ శిబిరాలు మూగబోయాయి. నిన్నటి వరకు రంగన్న మృతిపై స్పందించిన పలువురు నాయకులు.. రీ పోస్టు మార్టమ్ సహా.. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ఎవరికి వారు మౌనం పాటించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆదుర్దా కూడా కనిపించడం గమనార్హం.
మరో వైపు.. బెంగళూరులోనే ఉన్న వైసీపీ అధినేత జగన్.. రంగన్న మృతదేహానికి రీ పోస్టు మార్టం వ్యవహారంపై ఎప్పటికప్పు డు పార్టీ నాయకుల నుంచి సమాచారం తెలుసుకున్నట్టు తెలిసింది. తమ మీడియా సహా.. స్థానిక నాయకుల ద్వారా ఆయన సమాచారం సేకరించారని పార్టీ నాయకుల మధ్య చర్చ సాగుతోంది. జగన్ సూచనల కారణంగానే ఎవరూ స్పందించడం లేదని.. అందరూ మౌనంగా ఉన్నారని.. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆదుర్దాలతో ఉన్నారని తెలుస్తోంది. కాగా.. రీ పోస్టు మార్టం నివేదికను అధికారులు సోమవారం ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. అనంతరం.. సర్కారు చర్యలు తీసుకుంటుందని సమాచారం.