వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాకముందే… ఈ హత్యకు సంబంధించిన మరో కొత్త కేసు దర్యాప్తు ప్రారంభమైపోయింది. ఇప్పటికే ఈ కొత్త కేసు విచారణకు ఓ కొత్త బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కేసు ఒకింత ఆసక్తి రేకెత్తించేదిగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే… వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోతున్నారు. అది కూడా అనారోగ్య కారణాలతోనే వీరంతా చనిపోతున్న వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో సాక్షులంతా వరుసగా చనిపోతే… ఇక అసలు కేసు కొనసాగే అవకాశాలు లేవన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
బుధవారం వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. వివేకా ఇంటికి రంగన్న వాచ్ మన్ గా పనిచేశారు. వివేకా చనిపోయిన రోజు ఆయన ఇంటి ప్రధాన గేటు ముందే రాత్రంతా రంగన్న నిద్రించారు. అంతేకాకుండా వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారగానే.. వంట మనిషి రాగానే… వివేకా చనిపోయిన వైనాన్ని రంగన్ననే తొలుత గుర్తించారు.
సరిగ్గా… 2019 సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందుగా వివేకా చనిపోవడం, నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే నాడు కూడా సీఎంగా ఉండటం… వైసీపీ నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం… వివేకా కూడా తన సోదరుడి కుమారుడు అయిన జగన్ తో కలిసి వైసీపీలో కీలక నేతగా కొనసాగడం… ఈ అన్ని విషయాలను ప్రస్తావిస్తూ టీడీపీనే ఈ హత్యకు పాల్పడిందని జగన్ ఆరోపించారు.
అంతేకాకుండా వివేకా హత్య కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని చంద్రబాబు సర్కారును జగన్ డిమాండ్ చేశారు. అయితే ఆలోగా ఎన్నికలు పూర్తి కావడం, జగనే ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. అయితే విచారణ మాత్రం అనుకున్నంత వేగంగా సాగలేదు. ఫలితంగా చాలా కాలం పాటు వేచి చూసిన వివేకా కుమార్తె సునీత… ఈ కేసును కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తును వేగంగా ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని, దోషులను తేల్చి కఠినంగా శిక్షించాలంటూ ఆమె కోర్టును అభ్యర్థించారు. దీంతో సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో జోక్యం చేసుకుని కేసును త్వరితగతిన పూర్తి చేయాలంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆశించిన మేర ఫలితం అయితే రాలేదు.
ఇలాంటి నేపథ్యంలో వివేకా హత్య కేసుకు సంబంధించిన సాక్షులు వరుసగా చనిపోయారు. 2019లోనే శంకర్ రెడ్డి అనే సాక్షి చనిపోగా… 2022లో గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి చనిపోయారు. ఆ తర్వాత నారాయణ అనే సాక్షి కూడా చనిపోగా… గతేడాది సెప్టెంబర్ లో జగన్ కు సమీప బంధువు అయిన వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా చనిపోయారు. అభిషేక్ రెడ్డి కూడా వివేకా హత్య కేసులో కీలక సాక్షిగానే ఉన్నారు. తాజాగా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న కూడా బుధవారం చనిపోయారు. దీంతో ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిలో ఇప్పటిదాకా ఐదుగురు చనిపోయినట్టైంది. అందరూ అనారోగ్యం కారణంగానే చనిపోవడం కూడా గమనర్హమే.
ఈ క్రమంలోనే ఈ మరణాలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశామని కడప జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపామని ఆయన తెలిపారు. రంగన్న పోస్టుమార్టమ్ రిపోర్టు తమకు అందితే… దానిని పూర్తిగా పరిశీలించి అనుమానాలేమైనా ఉన్నాయా?.. లేదా? అన్న దానిపై ఓ అంచనాకు వస్తామన్నారు. మరి ఈ దర్యాప్తులో ఏ విషయాలు బయటపడతాయో… లేదంటే… ఈ కేసు కూడా వివేకా కేసు మాదిరే ఏళ్ల తరబడి సాగుతుందో చూడాలి.