ఏదైనా కేసు నమోదు అయ్యింది. పోలీసులు విచారణకు రమ్మన్నారు. సామాన్యులు అయితే భయంభయంగానే పోలీస్ స్టేషన్ వెళతారు. పోలీసు విచారణ అంటే వారికి అంతగా అవగాహన ఉండదు కదా. పోలీస్ స్టేషన్ అంటేనే భయం… అలాంటిది పోలీసుల విచారణకు అదే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే ఎవరికైనా భయమే. వెళితే.. ఏం చేస్తారోనని ఓ భయం.. వెళ్లకపోతే ఇంకేం జరుగుతుందోనన్న భయం.. ఇలా పోలీసులు పిలిచినంతనే సామాన్యులు విచారణకు హాజరయ్యేందుకే మొగ్గు చూపుతారు. అయితే పోలీసు విచారణ ఎలా జరుగుతుందో… ఆ శాఖలో ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్థాయిలో పనిచేసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బాగానే తెలుసు కదా. మరి పోలీసు విచారణ అంటే… ఆయనెందుకో గానీ దాదాపుగా వణికిపోయినంత పనిచేశారు.
ఫోక్సో కేసుల్లో బాధితుల వివరాలను బయటకు వెల్లడించారంటూ… మాధవ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సైబర క్రైమ్ పోలీసులు ఇటీవలే మాధవ్ కు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి బుధవారమే మాధవ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రాజకీయ నేతగా మారిన ఆయన బుధవారం తనకు వీలు పడదని… గురువారం విచారణకు వస్తానంటూ పోలీసులకు సమాచారం చేరవేశారు. అందుకు పోలీసులు కూడా సరేనన్నారు. చెప్పినట్లుగానే గురువారం విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం మాధవ్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మాధవ్ ఒక్కరే విచారణకు రాలేదు. తన వెంట ఓ 10 మంది లాయర్లను వెంటేసుకుని మరీ మాధవ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఓ మాజీ ఎంపీ, గతంలో పోలీసుగా పనిచేసిన మాధవ్ అభ్యర్థన మేరకు విచారణ సమయంలో తనతో పాటుగా ఓ న్యాయవాదికి అయితే పర్మిషన్ ఇస్తామని పోలీసులు చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఏం సమాధానం చెప్పాలో కూడా మాధవ్ కు అర్థం కాలేదు. దీంతో ఆయన అలా నిలబడిపోగా… మాధవ్ వెంట నల్ల కోటు వేసుకుని వచ్చిన ఓ లాయర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాధవ్ తో పాటు తమనందరినీ లోపలికి అనుమతించాల్సిందేనని ఆయన వాదించారు.
అయితే ఈ వాదనతో ఆగ్రహానికి గురైన పోలీసులు… ఒక్క లాయర్ కు మాత్రమే అనుమతి ఇస్తాం… అక్కర్లేదంటే ఆ లాయర్ ను కూడా వెనక్కు తీసుకెళ్లండి… అంతే గానీ పది మంది, ఐదుగురు విచారణలోకి వస్తామంటే కుదరదని తెగేసి చెప్పారు. దీంతో చేసేది లేక ఓ న్యాయవాదిని వెంటేసుకుని మాధవ్ పోలీసు విచారణకు వెళ్లిపోయారు. అయినా ఓ పోలీసు అధికారిగా విచారణకు నిందితుడి వెంట ఎంతమంది లాయర్లను పోలీసులు అనుమతిస్తారన్న విషయం కూడా మాధవ్ కు తెలియదా? అన్న దిశగా సెటైర్లు పడిపోతున్నాయి.