జగన్ కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ: నాదెండ్ల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం బాగున్నట్లు లేదు. తానేదో కూటమి బడ్జెట్ పై స్పందిద్దామని వస్తే.. ఈ కూటమి పార్టీలకు చెందిన నేతలంతా ఆయనపై ఒకరి తర్వాత మరొకరు ఒంటికాలిపై లేచారు. రాజకీయాలు అన్నాక.. వైరి వర్గాలపై విమర్శలు చేయకుండానే ఉంటారా? అంటూ కూటమి పార్టీల నేతల ఎదురు దాడిని చూసిన వైైసీపీ నేతలు వాపోతున్నారు. అయినా జగన్ ఒక్క మాట అంటే ఇంతమంది క్యూ కడతారా? అంటూ వారు తెగ బాధ పడిపోతున్నారట.

కూటమి సర్కారు బడ్జెట్ పై స్పందించిన జగన్.. ఆ తర్వాత సంక్షేమ పథకాలు వైసీపీ వాళ్లకు ఇవ్వొద్దంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వీటిపై ఘాటుగా స్పందించిన జగన్…మీడియా సమావేశం ముగింపు సందర్బంగా ఎవరో పవన్ పేరు ప్రప్తావనకు రాగానే… జగన్ తనదైన శైలి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ…. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జీవిత కాలంలో పవన్ ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారంటూ విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయారు.

పవన్ పై జగన్ వ్యాఖ్యలను విన్న జనసేన శ్రేణులు భగ్గుమన్నారు. పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. పవన్ ను చులకన చేసి మాట్లాడిన జగన్ తీరు సరి కాదన్నారు. పవన్ పై జగన్ విమర్శలు చేస్తే..తమకు ఆ పని చేత కాదనుకున్నారా? అంటూ విరుచుకుపడ్డారు. ఏం మేం అనలేమా? జగన్ కోడికత్తికి ఎక్కువ… గొడ్డలికి తక్కువ అని ఆయన పంచ్ డైలాగ్ సంధించారు. గొడ్డలితో బాబాయిని ఎలా చంపేశారో రాష్ట్ర ప్రజలకు తెలియదనుకుంటున్నారా? అని నాదెండ్ల మండిపడ్డారు.