సాయిరెడ్డి కుమార్తె పై జాలి చూపాల్సిన అవ‌స‌రం లేదు: హైకోర్టు

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు.. వి. విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డిపై ఏపీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ప‌ట్ల జాలి చూపించాలంటూ.. నేహా రెడ్డి త‌ర‌ఫున న్యాయ‌వాది చేసిన అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. అస‌లు జాలి చూపాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ‘ప్ర‌కృతి సంప‌ద‌ను దోచేస్తున్న వారంతా.. ఇలానే కోరుతున్నారు. ఈ విష‌యంలో ఎలాంటి జాలి చూపాల్సిన అవ‌స‌రం లేదు. ఆమె కోటీశ్వ‌రురాల‌ని.. మాకు తెలిసింది’ అని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానిం చారు.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు ఆ పార్టీ త‌ర‌పున సాయిరెడ్డి ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఆయ‌న వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌న గుప్పిట్లో పెట్టుకున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి కీల‌క‌మైన భీమిలి బీచ్‌ను ఆక్ర‌మించి.. రిసార్టును నిర్మించే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై జ‌న‌సేన కార్పొరేట‌ర్‌.. పీత‌ల మూర్తి యాద‌వ్‌.. తొలుత మీడియా ముందు చెప్పారు. ఆ త‌ర్వాత‌.. న్యాయ పోరాటానికి దిగారు. వైసీపీ హ‌యాంలోనే ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది.

అప్ప‌ట్లోనే నిర్మాణంలో ఉన్న రిసార్టును తొల‌గించాల‌ని.. హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు స‌ద‌రు అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించారు. అయితే.. ప్ర‌హ‌రీ కోసం బీచ్‌లో ఆరు అడుగుల మేర పునా దులు త‌వ్వారు. వీటిని అలానే వ‌దిలేశారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించిన హైకోర్టు.. ఈ పునాదుల కార‌ణంగా.. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

బీచ్‌లో గోడ తొలగించి ఆరు అడుగుల పునాదిని అలాగే వదిలేశారు. దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింది. గోడ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయండి. గోడ కూల్చివేత ఖర్చు, పర్యావరణ నష్టం నేహా రెడ్డి కంపెనీ నుంచి వ‌సూలు చేయండి అని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ స‌మ‌యంలోనే ఆమె త‌ర‌ఫున న్యాయ‌వాది.. జాలి చూపాల‌ని అన్నారు. అయితే.. జాలి చూపాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.