వైసీపీ సీనియర్ నాయకుడు, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గత రెండు రోజులుగా మండలిలో తన స్వరం జోరుగా వినిపిస్తున్నారు. నిజానికి అసెంబ్లీలో పట్టులేకున్నా.. సభకు వెళ్లకపోయినా.. వైసీపీ గళం మంఢలిలో వినిపిస్తోంది. బలమైన ప్రత్యర్థి పక్షంగా ఉండడంతో ఇక్కడ వైసీపీ వాదనకు అవకాశం ఏర్పడింది. అయితే.. మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్సకు పార్టీ అధిష్టానం ఫ్రీహ్యాండ్ ఇవ్వలేదా? ఆయన ఏం మాట్లాడాలన్నా.. ఒకింత ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ నాయకులు.
రెండు కీలక విషయాలను లేవనెత్తిన బొత్స మండలిలో అధికార పక్షానికి సవాళ్లు రువ్వారు. వీటిలో ప్రధానంగా.. అమరావతి రాజధాని వ్యవహారం. రెండోది విశాఖలో రుషికొండ వ్యవహారం. ఈ రెండు అంశాలను కూడా.. బొత్స సీరియస్‌గానే తీసుకున్నా రు. వీటిపై మండలిలో అధికార పార్టీ నాయకులకు ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడ్డానని చెబుతూనే.. ఇక్కడ తాత్కాలిక నిర్మాణాలు చేశారన్నారు. అయితే.. ఇదేసమయంలో అప్పట్లో వైసీపీ స్టాండ్ మూడు రాజధానులని చెప్పారు. కానీ, ఇప్పుడు తమ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇదే సమయంలో బొత్స రుషి కొండపై జరిగిన నిర్మాణాలు అక్రమం ఎలా అవుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వ అవసరాల కోసం వాటిని నిర్మించినట్టు చెప్పారు. ఒకవేళ అవి అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం భావిస్తే.. వాటిపై విచారణకు ఆదేశించుకోవచ్చ న్నారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వ పక్షం కూడా గట్టిగానే బదులిచ్చింది. కట్ చేస్తే.. ఈ రెండు అంశాలపై పార్టీ అధిష్టానం బొత్సపై ఫైరైనట్టు సమాచారం. ఈ రెండు విషయాలను అసలు ప్రస్తావించకుండా ఉండి.. నిరసన తెలిపి ఉంటే బాగుండేదని పార్టీ అధినేత జగన్ వ్యాఖ్యానించారని.. మూడు రాజధానుల విషయాన్ని ఎందుకు ప్రస్తావించారని కూడా ఆయన ప్రశ్నించినట్టు పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది.
ఇక, రుషికొండ విషయాన్ని అనవసరంగా లేవనెత్తారని.. దీనిపై చర్చ చేపట్టి లేని విషయాన్ని మండలిలో చర్చకు పెట్టారని కూడా జగన్ వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రస్తావించడం ద్వారా.. వైసీపీ దూకుడుగా ఉండాలని.. ఇష్టానుసారంగా సభల్లో వ్యాఖ్యానించి పార్టీని ఇరుకున పడేలా చేస్తే ఎలా అన్నది జగన్ చెప్పిన మాటగా తెలుస్తోంది. దీంతో బొత్స కూడా సైలెంట్ అయ్యారని.. తాను అనకుండానే అధికార పక్షం నేతలు రెచ్చగొట్టారని ఆయన వివరణ ఇచ్చినా.. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని జగన్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. మొత్తానికి బొత్సకు ఫ్రీహ్యాండ్ లేదన్న చర్చ అయితే జరుగుతుండడం గమనార్హం.