ఏపీలో తాజాగా జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఉమ్మడి గుంటూరు, కృష్నాజిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానంతోపాటు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పట్టభద్ర స్థానంలో కూటమి తరఫున పోటీ చేసిన ఇద్దరు నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ విజయం దక్కించుకున్నారు. ఒక్కొక్కరికీ లక్ష ఓట్లకు పైగానే మెజారిటీ దక్కింది. వాస్తవానికి భారీ పోటీ ఉంటుందని అనుకున్నా.. చివర కు.. అది తేలిపోయి.. ఏకపక్షంగానే విజయం దక్కించుకున్నారు.
అయితే.. ఇది పైకి చూసేందుకు రెండు మండలి స్థానాలే అయినప్పటికీ.. ఒకింత లోతుగా చూస్తే.. 61 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లోను.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ 61 అసెంబ్లీ స్థానాలు ఉన్నా యి. ఆయా నియోజకవర్గాల్లోనే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. దీనిని బట్టి.. కూటమి పట్టు ఏమాత్రం తగ్గలేదన్న విషయం వెలుగు చూసింది. నిజానికి సర్కారుపై ఏ చిన్న వ్యతిరేకత ఉన్నా.. ఈ విధంగా లక్షల ఓట్ల మెజారిటీ అయితే.. దక్కేది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఇదొక్కటే కాదు.. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పోలైన కూటమి ఓట్లతో పోల్చుకుంటే.. తాజాగా నమోదైన ఓట్లను పరిశీలిస్తే.. ఏకంగా 40 శాతం ఓటింగ్ పెరిగింది. ఇది కూటమికి సానుకూలంగా పడడం గమనార్హం. అంతేకాదు.. ఈ నాలుగు జిల్లాల్లోనూ.. కూటమి ప్రభావం మరింత పెరిగిందన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. గతంలో 61 నియోజకవర్గాల్లో ఒకటి రెండు స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకున్నా.. ఇప్పుడు అసలు ఎక్కడా ఆ పార్టీ ఊసు లేకుండా పోయింది.
అంతేకాదు.. తాజా ఎన్నికల్లో పోనీ పోటీ లేదని అనుకుందామంటే.. ఉమ్మడి గుంటూరు, కృష్నాలో 25 మంది, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 38 మంది చివరి వరకు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ.. కూటమి అభ్యర్థులకు భారీ ఎత్తున ఓట్లు దక్కాయంటే.. మొత్తం 61 నియోజకవర్గాల్లో ఎక్కడా సర్కారుపై వ్యతిరేకత లేదని కూటమి నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రజలు, మేధావులు, విద్యావంతులు తమవెంటే ఉన్నారని వారు చెబుతున్నారు. పలితాలు కూడా వీరి అంచనాలకు మించి ఉండడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.