ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. పథకాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాటలు వినిపించడం కుదరదు. ఈ విషయంలో కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్.. అధికారంలో ఉండి.. కేవలం ఈ మూడు అంశాలనే ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగారు. అయితే.. పథకాలు అందరికీ అందే అవకాశం లేదు. ఎంత ఖర్చు చేసినా.. ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకునే ఉంటుంది. ఇక, సంక్షేమం మాటా అంతే!
ఇక, మేనిఫెస్టోలోని అంశాలను పూర్తిగా అమలు చేశామని చెప్పినా.. జగన్ మాటను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు.పైగా.. ప్రత్యర్థులకు.. ఈ మూడు అంశాలు.. ఆయుధంగా మారాయి. పథకాలను మరింత ఎక్కువగా చేసి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. సంక్షేమం అందరికీ అందలేదన్న విషయాన్ని నారా లోకేష్ క్షేత్రస్థాయిలో వివరించారు. మేనిఫెస్టోలో చాలా అంశాలు మిగిలి ఉన్నాయని.. బీజేపీ చెప్పుకొచ్చింది. పైగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే వీటిని అమలు చేశారని తెలిపింది.
ఇవన్నీ.. సాధారణ ప్రజలకు చాలా చక్కగా ఎక్కాయి. ఇక, మధ్యతరగతి ఓటర్లు.. తాము కట్టిన పన్నులతో సంక్షేమం ఏంటి? అంటూ.. పెద్ద ఎత్తున వైసీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియలో కూటమి పార్టలు సక్సెస్ అయ్యాయి. ఇక, వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అంటే.. జమిలితో ముందుగానే వచ్చినా.. ఈ దఫా పథకాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాటలు వినిపించడం సాధ్యం కాదు. ఒకవేళ జగన్ వీటిని పట్టుకున్నా.. అది విఫలమైన రాజకీయం అవుతుంది.
కాబట్టే.. కూటమి సర్కారు పెద్దలు.. అభివృద్ధి, సామాజిక సమీకరణలను ఎంచుకున్నారు. మూడు పార్టీలను గమనిస్తే.. మూడు రకాల రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి సహా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అజెండాతో టీడీపీ ముందుకు సాగుతోంది. వీరికి బడ్జట్‌లోనూ నిధులు ఎక్కువగానే కేటాయించారు. ఇక, తన ఇమేజ్‌తోనే ముందుకు సాగేందుకు పవన్ నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. హిందూత్వ ఓటు బ్యాంకు చేజారకుండా.. బీజేపీ పవన్‌కు కలిసి వస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ రెండు అంశాలు.. కీలకంగా మారనున్న నేపథ్యంలో వైసీపీ తన పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.