కొన్నికొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ విషయంలో జరుగుతోంది. “లోకేష్ సర్ ఇప్పట్లో ఎవరినీ కలవరు.. ప్లీజ్ ఒక నెల ఆగి ట్రై చేయండి”- ఇదీ.. ఇప్పుడు లోకేష్ చాంబర్‌లోను.. ఆయన నివాసంలోనూ పనిచేస్తున్న పీఏలు, సెక్రటరీలు చెబుతున్న మాట. అది కూడా.. టీడీపీ సీనియర్లకే చెబుతున్న మాట. ఇదేమీ చిత్రమైన విషయం కాదు. చాలా సీరియస్ ఇష్యూనే.
మరి దీనికి కారణం ఏంటి? అంటే.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. దీంతో ఆశావహులు.. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొందరు.. నేరుగా సీఎం చంద్రబాబును కలుస్తున్నారు. వీరిలో టీడీ జనార్దన్, నెట్టెం రఘురాం వంటి సీనియర్ మోస్టులు కూడా ఉన్నారు. ఇక, గత ఎన్నికల్లో టికెట్ వదులుకున్న వారు సరేసరి! వారు నేరుగా చంద్రబాబును కలవక పోయినా.. తమను గుర్తు తెచ్చేలా నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తాజాగా రా.. కదలిరా! కార్యక్రమం ప్రారంభించి.. ఏడాది పూర్తయిందంటూ.. గుంటూరులో జంగా కృష్ణమూర్తి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇదే కార్యక్రమంపై మైలవరంలోమాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా అనుచరులు కూడా పోస్టులు పెడుతున్నారు. అంటే.. ఆయా కార్యక్రమాలను గుర్తు చేయడం ద్వారా.. తాము లైవ్‌లో ఉన్నామన్న విషయాన్ని వారు చెప్పకనే చెబుతున్నారు. ఇక, చంద్రబాబు అప్పాయింట్‌మెంటు దొరకని వారు.. నారా లోకేష్ చెబితే పని అవుతుందన్న నమ్మకం ఉన్నవారు.. ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో గత రెండు రోజుల నుంచి నారా లోకేష్‌ను కలవాలని కోరుతూ.. అప్పాయింట్‌మెంటు ఇప్పించాలని అభ్యర్థిస్తూ.. అనేక మంది నాయకులు క్యూ కడుతున్నారు. అయితే.. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న నారా లోకేస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు.. ఇలాంటి అభ్యర్థనలతో ముందుకు వచ్చే ఎవరికీ అప్పాయింట్‌మెంటు ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో ఆయన పీఏలు, సెక్రటరీలు.. సార్ బిజీగా ఉన్నారంటూ పోన్లు పెట్టేస్తున్నారట.