ఉత్త‌రాంధ్ర‌లో వ‌ర్మ‌కు దెబ్బ‌.. ఓడిన కూట‌మి నేత‌!

ఏపీలోని ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌రిధిలో ఉన్న టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానంలో కూట‌మి అభ్య‌ర్థికి భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. వాస్త‌వానికి కూట‌మి బ‌లం పుంజుకుని.. స‌ద‌రు అభ్య‌ర్థికి మేలు చేస్తుంద‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో కూట‌మి అభ్య‌ర్థి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన పీఆర్ టీయూ అభ్య‌ర్థి గాదె శ్రీనివాసులు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. తొలి ప్రాధాన్యం ఓట్లు ఎవ‌రికీ అనుకూలంగా రాలేదు. దీంతో రెండో ప్రాదాన్య‌తా ఓట్ల‌ను లెక్కించేస‌రికి.. శ్రీనివాసుల నాయుడు విజ‌యం ద‌క్కించుకున్నార‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

వాస్త‌వానికి ఉత్త‌రాంధ్ర‌లో ఉపాధ్యాయులు త‌క్కువ సంఖ్య‌లో ఉన్నారు. ఇక్క‌డ కేవ‌లం 25125 మంది ఓట‌ర్లు మాత్ర‌మే ఉన్నా రు. దీంతో ఫ‌లితం త్వ‌ర‌గానే వెలువ‌డుతుంద‌న్న ముంద‌స్తు  అంచ‌నాలు వ‌చ్చాయి. అనుకున్న‌ట్టుగానే సోమ‌వారం రాత్రి స‌మ యానికే అన్ని రౌండ్ల‌లోనూ ఓట్ల లెక్కింపు పూర్త‌యింది. ఇక‌, ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకాల‌పాటి ర‌ఘువ‌ర్మ ఏపీటీఎఫ్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌) త‌ర‌ఫున మ‌రో సారి బ‌రిలోకి దిగారు. అవివాహితుడు కావ‌డం.. ఉపాధ్యాయుల స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్కారం కోసం ఆయ‌న అలుపెరుగ‌ని పోరాటం చేయ‌డంతో సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

దీంతో కూట‌మి త‌ర‌ఫున ప్ర‌త్యేకంగా క‌మిటీ వేసి మ‌రీ పాకాల‌పాటికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీనికి విశాఖ ఎంపీ శ్రీభ‌ర‌త్ కూడా కృషి చేశారు. అయితే.. ఇక్క‌డ గాదె శ్రీనివాసుల నాయుడు బ‌రిలో ఉండ‌డం.. బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌డంతో ఆది నుంచి కూడా గాదె ముందంజ‌లో ఉన్నారు. రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపున‌కు వ‌చ్చేసరికి శ్రీనివాసులు చాలా ముందంజ‌లో చేరుకున్నారు. 13 వేల ఓట్ల ఆయ‌న ఖాతాలో ప‌డ‌గా.. కేవ‌లం 6 వేల ఓట్ల‌కు మాత్ర‌మే కూట‌మి అభ్య‌ర్థి ర‌ఘువ‌ర్మ ప‌రిమితం అయ్యారు. మూడో అబ్య‌ర్థి కోర‌డ్ల విజ‌య‌గౌరి ఓట్ల‌ను చీల్చ‌డంతో వ‌ర్మ‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ నేప‌థ్యంలో గాదె విజ‌యం సునాయాసంగా మారిపోయింది. “టీచర్ల తీర్పును శిరసావహిస్తా“ అని ఏపీటీఎఫ్ కూట‌మి అభ్యర్థి రఘువర్మ ప్ర‌క‌టించారు.