జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎట్టకేలకు తన రాజకీయ మజిలీని నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అమరావతి వచ్చిన ఆయన మంగళగిరి పరిధిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీతో తన తదుపరి ప్రస్థానం ఇక జనసేనతోనేనని ఆయన చెప్పకనే చెప్పేసినట్టైంది. జనసేనలో చేరతానని దొరబాబు చెప్పగా… అందుకు పనన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పేశారు. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లోనే దొరబాబు జనసేనలో చేరనున్నారు.
వాస్తవానికి పెండెం దొరబాబు మొన్నటి ఎన్నికల దాకా వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ లెక్కన 2024 ఎన్నికల్లో పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ స్థానం నుంచి దొరబాబుకే వైసీపీ అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారన్న ప్రకటన రాగానే… దొరబాబును పక్కనపెట్టేసిన జగన్… ఆ స్థానాన్ని వంగా గీతకు కేటాయించారు. ఎన్నికల్లో గీత ఓడిపోగా… పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పెండెం దొరబాబు వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వైసీపీని వీడిన పెండెం ఏ పార్టీలో చేరతారన్న దిశగా చాలా కాలం పాటు విశ్లేషణలు సాగాయి. టీడీపీలో చేరతారని కొందరు, జనసేనలో చేరతారని మరికొందరు భావించగా.. టీడీపీలో పెండెం చేరికను వర్మ వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో ఇక ప్రత్యామ్నాయంగా ఆయన జనసేననే ఎంచుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం ఆయన పవన్ తో భేటీ అయ్యారు. జనసేనలో చేరతానని కూడా పవన్ కు చెప్పేశారు. పిఠాపురంలో ఎలాగూ పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నాం కదా.. అందులోనే అధికారికంగా పార్టీ చేరిపోండి అని పవన్ ఆయనకు సూచించారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates