“మాట తప్పడు-మడమ తిప్పడు” అని వైసీపీ నాయకులు చెప్పుకొనే జగన్.. వ్యవహారం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అన్ని వైపుల నుంచి ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటు సాధారణ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు, పార్టీ నాయకుల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజల వరకు కూడా.. జగన్ వ్యవహారంపై ఆగ్రహంతోనే ఉన్నారు. అసెంబ్లీకి వెళ్లేది లేదని భీష్మించిన దరిమిలా.. ఆయనపై ఈ ఒత్తిడి పెరగడం గమనార్హం. దీంతో ఇప్పుడు మడమ తిప్పక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.
40 శాతం ఓటర్లు..
వైసీపీకి గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలే వచ్చాయి. దీంతోనే ప్రధాన ప్రతిపక్ష హోదాను ఆయన కోల్పో యారు. అయితే.. స్థానాలు 11 మాత్రమే దక్కినప్పటికీ..రమారమి.. ఓట్ల శాతం మాత్రం 40 శాతానికి చేరు కుంది. ఇప్పుడు ఈ ఓట్ల శాతంపైనే వైసీపీ నాయకులు బెంగ పెట్టుకున్నారు. జగన్ వ్యవహరిస్తున్న తీరుతో ఈ ఓట్ల శాతం పడిపోయే అవకాశం ఉంటుందన్న అంచనాలు వస్తున్నాయి. “మాపై నమ్మకంతో వందకు 40 మంది ఓటేశారు. మేం వారి కోసమైనా పనిచేయాల్సి ఉంటుంది” అని అనంతపురానికి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఇటీవల తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన సమయంలో వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేశారు. ఈ సమయంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చాలా వరకు సభలోనే వేచి ఉన్నారు. వీటి తాలూకు వీడియోలు.. తర్వాత కానీ బయటకు రాలేదు. అంటే.. వీరికి సభలో ఉండాలన్న అభిలాష ఉంది. “గతంలో మా వోళ్లు కూడా.. గేలి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తప్పదబ్బా!” అని మరో ఎమ్మెల్యే మీడియా మిత్రులతో ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్యానించారు. అంటే.. ఈయన మనసులోనూ.. సభకు రావాలన్న కోరిక ఉంది.
ఇలా.. ఒక్కరే కాదు.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.. సభకు వెళ్లి నిరసన తెలిపి వచ్చేయాలన్న ప్రతిపాదన పెట్టారు. ప్రజల సమస్యలపై మీడియా ముందు ఎందుకు.. సభలోనే చెబుదామని.. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మరో తొలితరం ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే.. జగన్ మాత్రం ప్రధాన ప్రతిపక్షహోదా కోసం వెంపర్లాడుతున్నారు. ఇదిలావుంటే.. ఓటు బ్యాంకు కదలిపోతే.. అప్పుడు మరింత ఇబ్బందులు తప్పవని ఇంకొందరు చెబుతున్నారు. వెరసి మొత్తంగా.. జగన్‌పై ఒత్తిడి తీవ్రంగానే ఉంది. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates