సారీ చెప్పినా కుదర్లే… పోసాని అరెస్ట్

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మొన్నటిదాకా వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్ గా వ్యవహరించిన పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. ఏపీ నుంచి వచ్చిన పోలీసులు…హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోం భుజాలో నివాసం ఉంటున్న కృష్ణమురళి నివాసంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు చెందిన కీలక నేతలపైై ఘాటు పదజాలంతో పోసాని దూషించిన సంగతి తెలిసిందే.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ లు విపక్షంలో ఉండగా… వారిపై పోసాని ఘాటు పదాలతో విరుచుకుపడేవారు. వైసీపీ నేతగా ఉంటూనే సినిమాలకు ఇబ్బంది లేకుండా సాగిన పోసాని… ఎప్పుడు ఏ అవకాశం లభించినా…చంద్రబాబు, లోకేశ్, పవన్ లను తులనాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబును పోసాని టార్గెట్ చేసినంతగా మరెవరూ చేయలేదంటే కూడా అతిశయోక్తి కాదేమో. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టగానే…ఒక్కసారిగా పోసాని ఆత్మరక్షణలో పడిపోయారు.

అంతేకాకుండా గతంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో బెంబేలెత్తిపోయిన పోసాని… వైసీపీకి రాజీనామా చేశారు. తన వ్యాఖ్యలు బాదించి ఉంటే సారీ అంటూ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. ఇకపై రాజకీయాల జోలికి వెళ్లబోనని, రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు. ఇదంతా జరిగిన తర్వాత కొంతకాలం పాటు బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి బుధవారం రాత్రి కడప జిల్లా రాయచోటి పోలీసులు పోసాని ఇంటి తలుపు తట్టారు. రాయచోటి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఆయనకు తెలియజేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని రాయచోటికి తరలిస్తున్నారు.