పెట్టుబ‌డి దారుల స‌ద‌స్సులో ప‌ట్టెడ‌న్నం కోసం ఫైటింగ్‌!

అది పెట్టుబ‌డి దారుల స‌ద‌స్సు. వేల కోట్ల రూపాయ‌ల నుంచి వంద‌ల కోట్లు పెట్టుబ‌డి పెట్టే సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు.. వివిధ రాష్ట్రాల‌కు చెందిన వారు పాల్గొన్నారు. ఇలాంటి స‌ద‌స్సులో నిర్వాహ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో వారు ప‌ట్టెడ‌న్నం కోసం ఫైట్ చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా.. చాలా మందికి భోజ‌నం ల‌భించ‌క‌.. తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఈ ప‌రిణామం.. పెట్టుబ‌డుల కంటే కూడా.. వివాదాల‌కు తావిచ్చేలా చేసింది.

ఎక్క‌డ‌?

బీజేపీ పాలిత మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో తాజాగా ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డి దారుల స‌ద‌స్సును ప్ర‌భు త్వం ఏర్పాటు చేసింది. దీనిని సాక్షాత్తూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ స‌ద‌స్సుకు ప్ర‌పంచ స్థాయి ప్ర‌ముఖ కంపెనీలు, పెట్టుబ‌డిదారులు, దిగ్గ‌జ వ్యాపార వేత్త‌ల‌ను ఆహ్వానించారు. మొత్తానికి తొలి రోజు చ‌ప్ప‌గా జ‌రిగిన ఈ స‌ద‌స్సుకు.. మ‌లిరోజు ప్ర‌భుత్వం భారీ ఎత్తున ప్ర‌చారం క‌ల్పించింది. దీంతో పెట్టుబ‌డి దారులు పోటెత్తారు.

ఈ క్ర‌మంలో వారికి భోజ‌న స‌దుపాయాలు, అల్పాహార ఏర్పాట్లు చేయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంది. దీంతో వారు భోజ‌నాల గ‌దిలో ప్లేట్లు ల‌భించ‌క ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌, ప్లేట్లు ల‌భించిన వారు కూడా.. అన్నం త‌మ వ‌ర‌కు వ‌స్తుందో రాదో .. అన్న బెంగ‌తో ఎగ‌బ‌డ్డారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. అదేస‌మ‌యంలో ప్లేట్లు తీసుకున్న వారిపై ఎగ‌బ‌డి మ‌రీ కొంద‌రు ప్లేట్లు లాగేసుకోవ‌డంతో స‌ర్వ‌త్రా ఒక భ‌యాన‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

ఈ ప‌రిణామాల‌పై మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మౌనం వ‌హించింది. కానీ, విప‌క్షాలు మాత్రం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాయి. పెట్టుబ‌డి దారుల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టలేక‌పోయారు.. అంటూ బీజేపీ నేత‌ల‌పై కాంగ్రెస్ స‌హా.. ఇత‌ర పార్టీల నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీని తాలూకు వీడియోలు వైర‌ల్ కావ‌డంతో ఇత‌ర పెట్టుబ‌డిదారులు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.