“కడుపు రిగిలింది అధ్యక్షా.. జగన్ వస్తే.. ఇచ్చిపడేసేవాణ్ణి!” – అని బీజేపీ శాసన సభా పక్ష నేత, సీనియర్ నాయకుడు విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ఆసక్తిగా మారాయి. తాజాగా మంగళవారం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. “సభలో జగన్ లేని లోటు కనిపిస్తోందని.. అందరూ అంటున్నారు అధ్యక్షా” అని వ్యాఖ్యానించారు.
దీంతో సభలో ఉన్నవారు అందరూ ఫక్కున నవ్వారు. అలా తాము అనలేదని.. జగన్ వచ్చి ఉంటే బాగుం డేదని మాత్రమే అన్నామని.. టీడీపీ సభ్యులు ఒకరిద్దరు పేర్కొన్నారు. అనంతరం విష్ణు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. “జగన్ సభకు వస్తాడేమోనని.. నేను కూడా ఆసక్తిగానే ఎదరు చూస్తున్నా. కానీ, ఆయన రాలేదు. పోనీ.. ఆయన సభ్యులనైనా పంపించొచ్చుకదా!” అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని.. “అది వారి ఇష్టం” అన్నారు.
ఇక, విష్ణు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. “గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. జనాలు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా అయితే.. కడుపు మండిపోది. ఇవాళ జగన్ కానీ, ఆయన సభ్యులు కానీ సభకు వస్తారేమో.. కడుపుమంట తీర్చుకుందామను కున్నా. ఇవాళ సభకు రాలేదు. కానీ, రావాలి అధ్యక్షా. వాళ్లను రప్పించేందుకు మీరుబాధ్యత తీసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. సభలో సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమన్న విష్ణుకుమార్ రాజు.. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. జగన్‌పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందోనని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైసీపీ నాయకులే తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు. పెద్ద వయస్కులైన 89 ఏళ్ల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పోడియం ముందుకు పంపి నిరసన తెలపమని చెప్పడం జగన్‌కు సిగ్గుగా లేదా? అని విష్ణు తీవ్ర విమర్శ చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఎవరిని వదిలిపెట్టడంలేదన్నారు.