జైల్లో దస్తగిరి బ్యారక్ లోకి వెళ్లింది నిజమే!

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఇప్పటివరకు చోటు చేసుకున్న పలు సంచలన పరిణామాలకు కొనసాగింపుగా మరో సంచలనం చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి సిద్ధమైందని.. త్వరలోనే అధికారికంగా బయటకు వస్తుందని చెబుతున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. అయితే.. దస్తగిరి కడప జైల్లో ఉన్న వేళలో.. అతడి బ్యారక్ లోకి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడే డాక్టర్ చైతన్య రెడ్డి. జైల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ సందర్భంగా అతడు జైల్లోని తన బ్యారక్ లోకి వచ్చినట్లుగా దస్తగిరి ఆరోపించారు.

దీనికి సంబంధించిన కేసు గతంలో కోర్టు కొట్టేసింది. తాజాగా మరోసారి ఈ ఉదంతం తెర మీదకు వచ్చింది. టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి.. తాను కడప జైల్లో ఉన్నప్పుడు.. తనకు ఎదురుగా ఉన్న బ్యారక్ లోకి చైతన్య రెడ్డి వెళ్లిన మాట వాస్తవమంటూ వ్యాఖ్యానించారు. ఆ బ్యారక్ లో ఉన్న దస్తగిరిని కలిసినట్లుగా తనకు జైలు సిబ్బంది చెప్పినట్లుగా బీటెక్ రవి పేర్కొనటమే కాదు.. అదే అంశాన్ని వాంగ్మూలంగా ఇచ్చారు.

వివేకా కేసులో అవినాష్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి.. శివశంకర్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్పటంతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా దస్తగిరి ఆరోపించారు. దీనిపై విచారణాధికారికి నాడు దస్తగిరి బ్యారక్ వద్ద విధుల్లో ఉన్న డిప్యూటీ జైలర్ వాంగ్మూలం ఇచ్చారు. బ్యారక్ లోకి చైతన్య రెడ్డి వెళ్లింది నిజమేనని చెప్పినట్లుగా సమాచారం.

అంతేకాదు.. వారం క్రితం ఖైదీలను విచారించగా.. కొందరు చైతన్య రెడ్డి దస్తగిరి బ్యారక్ లోకి వెళ్లినట్లుగా సమాచారం. అదే సమయంలో జైల్లో ఉన్న డాక్టర్లు.. నర్సులను విచారించగా.. వారు సైతం దస్తగిరిని కలిసిన వైనాన్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని టీడీపీ నేత.. మాజీ ఎమ్మెలసీ బీటెక్ రవిని విచారణాధికారి ఆన్ లైన్ లో సాక్ష్యం ఇచ్చినట్లుగా సమాచారం.

మొత్తంగా 30 మంది నుంచి వాంగ్మూలం నమోదు చేసిన విచారణాధికారి జైళ్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాలతో డాక్టర్ చైతన్య రెడ్డికి షాకులు ఎదురుకావటం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.