మొత్తానికి అమరావతి రాజధాని కేంద్రంగా జరిగిన భూ అక్రమాలపై విచారణ జరపాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి రాజధాని నగరం కోసం సేకరించిన భూమిలో తుళ్ళూరులో పనిచేసిన ఎంఆర్వో సుధీర్ బాబు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అప్పటి ఎంఆర్వో మీద వచ్చిన ఆరోపణలపై సీఐడి తో విచారణ కూడా జరిపిస్తోంది. అయితే తనపై విచారణ జరపకుండా సుధీర్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.
హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్ళింది. అక్కడ విచారణ దశలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రింకోర్టు అభిప్రాపయడింది. అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించేటపుడు కోర్టుల జోక్యం తగదంటూ హితవు పలికింది. వారంలోగా ఈ కేసులో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలంటూ హై కోర్టును ఆదేశించిన సుప్రింకోర్టు మళ్ళీ ఈ కేసును తిప్పి పంపేసింది.
మళ్ళీ ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు చివరకు అప్పటి ఎంఆర్వో పై వచ్చిన ఆరోపణలపై సీఐడి విచారణ జరిపించాల్సిందే అంటు తీర్పు చెప్పింది. అవినీతి, అక్రమాలపై విచారణ దశలో కోర్టుల జోక్యం ఉండకూడదంటు సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా జడ్జీ ఉదహరించారు. సుధీర్ అమరావతి ప్రాంతంలో డ్యూటీ చేసినపుడు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన భూములన్నింటినీ టీడీపీ నేతలకు దక్కేట్లుగా చక్రం తిప్పారనేది ఆయనపై ఉన్న అభియోగాలు.
ఎలాగంటే రాజధాని కోసం భూములను ప్రభుత్వం తీసేసుకుంటే నష్టపరిహారం దక్కదని సుధీర్ భూయజమానులను భయపెట్టారట. దాంతో ఎంఆర్వో చెప్పిన మాటను నమ్మిన భూయజమానులు తమ భూములను అమ్మేసుకున్నారు. ఈ అమ్మకాలన్నింటినీ సుధీర్ బాబే దగ్గరుండి జరిపించాడనేది ఆరోపణ. అలా అమ్మకాలు జరిగిన అసైన్డ్ భూములన్నీ చివరకు టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత ఆ భూములను నేతలు ప్రభుత్వానికి అప్పగించి భారీగా లబ్ది పొందారన్నది ప్రధాన ఆరోపణ. మరి విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే.