ఎంత మంది పిల్ల‌లున్నా ఓకే.. ఏపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

స్థానిక ఎన్నికల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న‌ను ప‌క్క‌న పెట్టింది. ఇక నుంచి ఎంత మంది పిల్ల‌లు ఉన్నా.. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అర్హులేన‌ని పేర్కొంటూ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా న్యాయ శాఖ కూడా ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుపై గెజిట్ జారీ చేసిన‌ట్ట‌యింది.

ఇప్ప‌టివ‌ర‌కు.. దేశ‌వ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఇద్ద‌రు పిల్ల‌ల‌కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాల్లోని వ్య‌క్తులు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అన‌ర్హులు. ఇది పార్ల‌మెంటు చేసిన చ‌ట్టం ప్రకారం అనుస‌రిస్తున్న నిబంధ‌న‌. రాజ్యాంగంలో ఈ మేర‌కు ఎక్క‌డా ప్ర‌త్యేక క్లాజ్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే నిబంధ‌న‌ను 1973 నుంచి ఉమ్మ‌డిఏపీలోనూ అనుసరిస్తున్నారు. దీంతో చాలా మంది అభ్య‌ర్థులు స్థానిక సంస్థ‌ల్లో పోటీ చేసేందుకు అర్హ‌త కోల్పోతున్నారు.

దీనిపై గ్రామీణ స్థాయిలో ఎప్ప‌టిక‌ప్పుడు.. చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. అయితే.. దీనిని స‌వ‌రించేందుకు ప్ర‌భుత్వాలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. కాగా.. చంద్ర‌బాబు నాలుగోసారి ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న‌ను తొల‌గిస్తామ‌ని చెప్పారు. దీనికి అనుగుణంగానే గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ విష‌యంపై స్వ‌ల్పకాలిక చ‌ర్చ చేప‌ట్టి స‌భ‌లో ఆమోదించారు. అనంత‌రం.. ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని న్యాయ‌శాఖ‌కు రిఫ‌ర్ చేసింది. దీనిపై ఎలాంటి వివాదాలు రాకుండా.. నిర్ణ‌యం తీసుకునే బాధ్య‌త‌ను అప్ప‌గించారు.

దీనిపై స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేసిన న్యాయ శాఖ‌.. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా.. ఏపీలో వ‌చ్చే 2026-27లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎక్కువ మంది పోటీ చేసేందుకు అర్హత ల‌భించ‌నుంది.