ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అయితే అంచనాలకు హద్దులు ఉంటాయా. దర్శకుడు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్, పవన్ కలిసి ఈసారి ఏ రేంజ్ లో మేజిక్ చేస్తారోనని ఆశలు పెట్టుకోవడం సహజం.

నిన్న గ్రాండ్ గా ఉస్తాద్ భగత్ సింగ్ లోని రెండో ఆడియో సింగల్ ఆరా పేరుతో రిలీజ్ చేశారు. ఈవెంట్ లో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చారు. ఆన్ లైన్ వెర్షన్ కొంచెం ఆలస్యమైనా ఫ్యాన్స్ చాలా ఓపికగా ఎదురు చూశారు. దేఖ్ లేంగే సాలాకు డబుల్ డోస్ లో ఉంటుందని ఆశించారు. కానీ జరిగింది వేరులా ఉంది.

ఆరా అఫ్ ఉస్తాద్ పాటకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే లాంటి పడికట్టు పదాలతో సాంగ్ కంపోజ్ చేయడం ఏమిటని కొందరు, ట్యూన్ ఎంత మాత్రం ఎక్కేలా లేదని మరికొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ నుంచి ఇలాంటి మాములు సాహిత్యం ఆశించలేదని అంటున్నారు.

గతంలో దేవి కొన్ని పాటలు మొదట్లో నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని ఆ తర్వాత చార్ట్ బస్టర్ అయినవి ఉన్నాయి. ఆరా పాట కూడా అదే కోవలోకి చేరుతుందా లేదా ఇప్పుడొచ్చిన స్పందనకు తగ్గట్టు సోసోగా నిలుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. కొంచెం వెయిట్ చేయాలి.

హైప్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే సమస్యలు ఇవే. గబ్బర్ సింగ్ లాంటి క్యాచీ సాంగ్ ఎక్స్ పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి ఆరాలు వెంటనే కనెక్ట్ కావు. దీంతో ఆ కోపం పలు రూపాల్లో ఆన్ లైన్ లోకి వచ్చేస్తుంది. పోలిక ప్రకారం చూసుకుంటే దీనికన్నా దేఖ్ లేంగే సాలానే మెరుగ్గా ఉందనేది కాదనలేని వాస్తవం.

దానికి ఇవ్వని ఎలివేషన్లు నిన్న ఆరాకు అందరూ కలిసి మూకుమ్మడిగా ఇచ్చారు. తీరా చూస్తే గ్రౌండ్ లెవెల్ పరిస్థితి వేరేలా ఉంది. మెల్లగా ఎక్కుతుందని భావిస్తున్న ఫ్యాన్స్ లేకపోలేదు. మేజిక్ జరగలేదన్న బాధ అయితే ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో కనిపిస్తోంది. మూడో పాట వచ్చేలోపు నిలదొక్కుకుంటుందేమో చూడాలి.