తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది? దీని వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యంపై దృష్టి పెట్టింది. దీంతో తిరుమ‌ల అధికారుల ఫిర్యాదుల మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉంద‌న్న కోణంలోనూ ద‌ర్యాప్తు సాగుతోంది.

ఏం జ‌రిగింది?

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన తెలంగాణ మ‌హిళ 300 రూపాయ‌ల క్యూలైన్‌లో ఉండ‌గా.. పాము కాటు వేసింద‌ని సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. తిరుమ‌లలో సాధార‌ణ భ‌క్తుల‌కు భద్ర‌త క‌రువైంద‌ని.. తిరుమ‌ల‌ను రాజ‌కీయంగా వాడుకుంటున్నార‌ని.. అందుకే భ‌క్తుల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని సోష‌ల్ మీడియాలో ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. దీంతోవెంట‌నే స్పందించిన సీఎంవో అధికారులు అస‌లు ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై ఆరా తీశారు.

వాస్త‌వం ఇదీ..

తెలంగాణ‌లోని వరంగల్‌కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు స్వామి దర్శనం కోసం వచ్చారు. ఆర్‌.బి.సెంటర్‌ పార్కింగ్‌ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశంతో మౌనిక కారు నుంచి కిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో గుచ్చుకోవడంతో ఆమె భ‌యంతో కేక‌లు పెట్టారు. ఆమె భర్త శరత్ బాబు చుట్టుప‌క్క‌ల వెతికి చూడ‌గా ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో ఆమెను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

అయితే.. ఆమె కాలిని పాముకాటు వేయ‌లేద‌ని.. వైద్యులు నిర్ధారించారు. అనంత‌రం మెరుగైన వైద్యం కోసం.. తిరుపతిలోని స్విమ్స్‌కు త‌ర‌లించారు. అక్క‌డి వైద్యులు కూడా.. పాము కాటు కాద‌ని తెలిపారు. అయితే.. బాధితురాలికి 300 రూపాయ‌ల క్యూలైన్‌లోనే పాము కాటు వేసింద‌ని.. ఆమె ప్రాణా పాయ స్థితికి చేరుకున్నార‌ని పేర్కొంటూ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జోరుగా సాగింది. దీనిపైనే ప్ర‌భుత్వం ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.