అమరావతికి రూ.26 వేల కోట్లు వచ్చేసినట్టే!

ఏపీ నూతన రాజధాని అమరావతికి ఇక నిధుల కొరత అన్న మాట వినిపించదు. ఎందుకంటే… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కేవలం 7 నెలల్లోనే.. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ఏకంగా రూ.26 వేల కోట్లు అందివచ్చాయి. పలు ఆర్ధిక సంస్థల నుంచి నిధుల విడుదలకు ఆమోదం లభించిన వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని పనులను ప్రారంభించేశారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో మరింతగా వేగం పెరిగేలా మంగళవారం రాత్రి ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

కూటమి సర్కారు అధికారం చేపట్టినంతనే.. సీఎం చంద్రబాబు తన పలుకుబడిని వినియోగించి కేంద్రం నుంచి రాజధానికి నిధులు వచ్చే దిశగా అడుగులు వేశారు. చంద్రబాబు యత్నాలు ఆదిలోనే మంచి ఫలితాలను ఇచ్చాయి. గత బడ్జెట్ లోనే కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల మేర ఋణం ఇప్పించే దిశగా ఓ కీలక ప్రకటన చేసింది. కేంద్రం గ్యారెంటీ ఇచ్చే ఈ నిధులను ఏపీకి ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా… తనతో పాటుగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో జతకట్టి వరల్డ్ బ్యాంకు రూ.15 వేల కోట్లను ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నిధులు ఇప్పటికే విడతల వారీగా విడుదల అయిపోతున్నాయి కూడా.

ఓ పక్క వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో)తోనూ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి… రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.11 వేల కోట్ల ఋణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి తెలిపింది. ఈ రుణానికి సంబంధించిన మంజూరు పత్రాలు మంగళవారం ఏపీకి అందాయి. మంగళవారం అమరావతి వచ్చిన హడ్కో ప్రతినిధులు ఎస్.ఎం. శ్రీనివాస్, కె. విజయ్ కుమార్ రుణ మంజూరు పత్రాలను సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబుకు అందజేశారు. అంటే… ఇప్పటిదాకా అమరావతి నిర్మాణం కోసం మంజూరు అయిన మొత్తం రూ.26 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందినట్టేనన్న మాట.