మోడీ `అడ్వైజ‌రీ బోర్డు`లో చోటు.. ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన‌ చిరు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్ర‌శంస‌ల జ‌ల్లుకురిపించారు. ద‌క్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్‌.. అని పేర్కొన్నారు. సౌత్ ఇండియా సినీ ఇండ‌స్ట్రీలో చిరంజీవిది చెర‌గ‌ని స్థాన‌మని పేర్కొన్నారు. ఆయ‌న అనుభ‌వాలు, సూచ‌న‌లు, స‌ల‌హాలు..త‌మ‌కు ఎంతో అవ‌స‌ర‌మ‌ని కూడా పేర్కొన్నారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ హీరోల‌తో ప్ర‌ధాని వీడియో మాధ్య‌మంలో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ ఏడాది డిసెంబ‌రులో కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో `ప్ర‌పంచ ఆడియో, విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్ మెంట్` స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించి.. ప్ర‌ముఖ హీరోలు, హీరోయిన్ల నుంచి స్వ‌యంగా ప్ర‌ధాని మోడీ స‌లహాలు, సూచ‌న‌లు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన ప్ర‌ధాని.. ద‌క్షిణాది సినీ రంగం దేశ వృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తోంద‌న్నారు. అలాంటి సినీ రంగంలో 40 ఏళ్లు చిరు రారాజులా వెలుగుతున్నారని కొనియాడారు.

ఆయ‌న నుంచి స‌ల‌హాలు తీసుకునేందుకు దేశం ఎదురు చూస్తోంద‌ని మోడీ వ్యాఖ్యానించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన చిరంజీవి.. మోడీ నేతృత్వంలో నిర్వ హించ‌నున్న స‌ద‌స్సులో తాను భాగం కావ‌డం.. త‌న స‌ల‌హాల‌ను ప్ర‌ధాని స్వీక‌రించేందుకు ముందుకు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. మోడీ అడ్వైజ‌రీ బోర్డులో త‌న‌కు కూడా చోటు క‌ల్పించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీని కూడా.. చిరు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. మోడీ నాయ‌క‌త్వంలో దేశం మ‌రింత ముందుకు సాగుతుంద‌న‌డంలో సందేహం లేద‌ని చెప్పారు. కాగా.. కొన్నాళ్ల కింద‌ట చిరంజీవి ప్ర‌త్యేకంగా మోడీని క‌లుసుకున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు న‌టుల్లో చిరంజీవి, నాగార్జున‌ల‌కు మాత్ర‌మే అవ‌కాశం చిక్కింది.