ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న మాటల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఒక్క పోలవరం పేరు మాత్రమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వినిపించినా… చాలా అంశాల్లో ఏపీకి కేటాయింపులు ఉన్న విషయం బయటకు రావడంతో విపక్షాల వాదనలు తేలిపోయాయి. అంతేకాకుండా అటు కేంద్రంతో పాటుగా ఇటు రాష్ట్రంలోనూ కూటమి సర్కారే ఉన్న నేపథ్యంలో ఏపీకి బడ్జెట్ లో అన్యాయం ఎలా జరుగుతుందని అధికార పక్షం ఎదురు దాడి చేయడంతో విపక్షాల నోళ్లకు మూత పడింది.

తాజాగా రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీగా కేటాయింపులు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా రైల్వే బడ్జెట్ లోని పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన వైష్ణవ్… రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీ కేటాయింపులు చేశామన్నారు. ఈ బడ్జెట్ లో ఏపీకి రూ.9,147 కోట్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఏపీకి ఇప్పటికే అమరావతి రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి…ఆ నిధులు అదనమని తెలిపారు.

ఈ నిధులతో పాటుగా పలు కొత్త రైళ్లను ఏపీకి కేటాయించినట్లు వైష్ణవ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 100 అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రైళ్లలో రూ.450తో ఏకంగా వెయ్యి కిలో మీటర్ల దూరం ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. వీటికి అదనంగా నవ భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నామన్నారు. వీటికి తోడుగా వందే భారత్ రైళ్ల సంఖ్యను మరింతగా పెంచుతున్నట్లు తెలిపారు. ఏపీతో పాటుగా తెలంగాణకు కూడా ఈ కొత్త రైళ్ల కేటాయింపుల్లో సింహభాగం దక్కనుందని ఆయన తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ మొత్తాన్ని విద్యుదీకరించామని మంత్రి తెలిపారు.