ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వార్ కు తెర తీశారు. విధ్వంసక భావజాలంతో సాగిన గద్దర్ కు బరాబర్ పద్మ అవార్డులను ఇవ్వబోమంటూ సంజయ్ సోమవారం ఉదయం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వేగంగానే కాకుండా ఘాటుగానే తప్పికొట్టే యత్నం చేసింది.
గద్దర్ మరణించిన సందర్భంగా ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా గద్దర్ సతీమణి విమలకు ఓ లేక రాసిన సంగతి తెలిసిందే. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ లేఖను బయటకు తీసింది. గద్దర్ విధ్వంసక భావజాలంతో కొనసాగిన విషయం నాడు ప్రధానిగా ఉన్న మీ పార్టీ నేత మోదీకి తెలియలేదా?… లేదంటే గుర్తు లేదా? అంటూ కాంగ్రెస్ పార్టీ కాస్తంత ఘాటుగానే స్పందించింది.
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ గణతంత్ర దినోత్సవం నాడే సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్దర్ లాంటి వారికి అవార్డులు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పంపామని, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్… బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డులను ఇవ్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates