డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే జరుగుతున్నాయి. వీటిలో కీలకమైంది.. కాకినాడ సీపోర్టులో అప్పట్లో నిలిపి ఉంచిన విదేశీ షిప్పు. ‘సీజ్ ది షిప్’ అని పవన్ ఆదేశించినా.. సీజ్ చేయలేకపోయారు. ఇది ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చగానే ఉంది. ఇక, మరో కీలకమైన ఆదేశం.. రహదారుల బాగుచేత. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులను ముఖ్యంగా పంచాయతీ స్థాయిలో బాగు చేస్తామన్నారు.
వైసీపీ హయాంలో రహదారులను పట్టించుకోలేదని.. సో.. ఇప్పుడు తాము బాగు చేస్తున్నామని కూడా పవ న్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే గ్రామీణ , పంచాయతీ, గిరిజన ప్రాంతాలకు చెందిన రహదారులను తిరిగి నిర్మించడం లేదా.. బాగు చేయడం.. అసలు లేనిచోట కొత్తవాటిని నిర్మించడం అనే కాన్సెప్టు ను పెట్టుకున్నారు. దీనికి సంబంధించి సంక్రాంతి పండుగను టార్గెట్‌గా పెట్టుకుని ఇదే ప్రకటన కూడా చేశారు. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి అవుతాయని కూడా ప్రకటించారు.
కానీ, తాజాగా పవన్ కల్యాణ్ చేసిన రివ్యూలో.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పంచాయతీలు, గిరిజన ఆవాసాలు ఉన్న ప్రాంతాల్లో 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వాస్తవానికి ఆయా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో పనులు వేగంగా సాగుతాయని లెక్కలు కూడా వేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు పనులు ముందుకు సాగలేదు. దీంతో పెట్టుకున్న సంక్రాంతి లక్ష్యం పక్కకు తొలగిపోయింది.
దీనిపైనే పవన్ దృష్టి పెట్టారు. ఇచ్చిన నిధులు 2672 కోట్లు.. సరిపోలాదా? లేక.. పనులు ఆగిపోయాయా? ఎవరైనా ఆపారా? అన్నది ఆయన చర్చించారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అధి కారులు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. కాంట్రాక్టర్ల విషయంలో వారు జోక్యం చేసుకోవడం.. పనుల నిలిపివేత.. సొంతానికి రహదారులు నిర్మించుకోవడం వంటివి వెలుగు చూసినట్టు తెలిసింది. దీనిపై ఆర్ అండ్ బీ అధికారులు పెద్ద నివేదికే ఇచ్చారని తెలిసింది. ఆ వెంటనే ఈ వ్యవహారంపై సీరియస్ అయిన.. పవన్.. సీఎం చంద్రబాబు ముందు పెట్టి సదరు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.