దావోస్ లో ‘అరకు’ ఘుమఘుమలు!

స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. అటు తమ పెట్టుబడులకు గల అవకాశాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకునేందుకు పారిశ్రామికవేత్తలు దావోస్ వచ్చారు. అదే సమయంలో తమ ప్రాంతాలకు పెట్టుబడులను రాబట్టుకునేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చారు. వెరసి అటు ఇండస్ట్రియలిస్ట్ లు, ఇటు పొలిటీషియన్లతో దావోస్ నిజంగానే కిక్కిరిసిపోయింది.

అంతటి రద్దీలోనూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ పరిసరాల్లోకి వెళితే… కమ్మటి కాఫీ సువాసలను ముక్కు పుటాలను అదరగొడుతున్నాయట. ఎందుకంటే… ఏపీలోని విశాఖ జిల్లా పరిధి మన్యంలో పండే అరకు కాఫీని ఏపీ పెవిలియన్ కు వచ్చే అతిథులకు సర్వ్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా అక్కడ అరకు కాఫీ మెషీన్ ను ఏర్పాటు చేశారు. ఫలితంగా అరకు సువాసనలు ఏపీ పెవిలియన్ పరిసరాలను మరింత ఆకర్షణీయంగా మార్చేశాయట.

ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెల్లడించారు. బుధవారం నాడు ఏపీ పెవిలియన్ లో జరిగిన పరిణామాలను వివరించిన లోకేశ్… అందులో భాగంగా ఏపీ పెవిలియన్ లో ఏర్పాటు చేసిన అరకు కాఫీ మిషన్ ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. తాము అందిస్తున్న అరకు కాఫీ అతిథుల మనసులను కొల్లగొడుతోంది అంటూ ఆయన ఓ కామెంట్ ను కూడా సదరు ఫొటోకు యాడ్ చేశారు.

ఇదిలా ఉంటే… ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అరకు కాఫీని ప్రమోట్ చేసే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవలే విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన అరకు కాఫీతో కూడిన గిఫ్ట్ ప్యాక్ ను బహూకరించారు. అదే విధంగా ఏపీకి వస్తున్న అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు అరకు కాఫీని ఆయన అందజేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా అరకు కాఫీతో కూడిన గిఫ్ట్ ప్యాకెట్లను భారీ సంఖ్యలో తయారు చేయించుకున్నారట. ఈ విషయాన్ని గ్రహించిన మీదటే దావోస్ లో ఏపీ పెవిలియన్ లోనూ అధికారుల బృందం అరకు కాఫీని ఏర్పాటు చేసింది.