కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్ మహానగర అభివ్రద్ధి సంస్థ) పరిధిని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఓఆర్ఆర్ దాటి.. ట్రిపుల్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) పరిధిలోపు మాత్రమే ఉన్న హెచ్ఎండీఏ పరిధి.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పరిధిని కూడా దాటేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని త్వరలో మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిది 7,257 చదరపుకిలోమీటర్ల వరకు ఉండగా.. తాజా విస్తరణతో 13వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే హెచ్ఎండీఏలోకి కొత్తగా మరో నాలుగు జిల్లాలు.. 32 మండలాలు చేరనున్నాయి. వీటి పరిధిలోకి 11 జిల్లాలు (కొత్తవి).. 106 మండలాలు.. 43 అర్బన్,స్థానిక సంస్థలు చేరనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు.. విజన్ కు తగ్గట్లుగా అధికారులు ఈ ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. తాజా ప్రతిపాదనల నేపథ్యంలో ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న నగర రియల్ ఎస్టేట్ తో పాటు.. శివారు రియల్ ఎస్టేట్ కు కొత్త ఊపు రానున్నట్లుగా చెప్పాలి.
తాజా ప్రతిపాదల్ని సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. హెచ్ఎండీఏ పరిధి ట్రిఫుల్ ఆర్ తర్వాత ఐదు కిలోమీటర్ల వరకు పరిధి పెరగనుంది. దీంతో..ఈప్రాంతమంతా హైదరాబాద్ మహానగర పరిధిలోకి రానుంది. ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిధి పెరగటమంటే.. సుమారు ఐదారు వేల చదరపుకిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది. పదిహేడేళ్ల క్రితం హెచ్ఎండీఏ పరిధిని డిసైడ్ చేయగా.. తాజాగా మరోసారి దీని పరిధిని భారీగా పెంచేలా ప్రభుత్వం ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది.
ఇప్పటికే ట్రిఫుల్ ఆర్ పుణ్యమా అని శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా.. తాజా నిర్ణయంతో మరింత వేగంగా భూముల ధరలు పెరిగే వీలున్నట్లుగా చెప్పాలి. హైదరాబాద్ పరిధిని పెంచుతూ యాభై ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. అనంతరం నగర విస్తరణకు అనుగుణంగా 2006లోహుడాను హెచ్ఎండీఏగా మార్చారు. దీంతో దీని పరిధి 7257 చదరపుకిలోమీటర్లకు విస్తరించింది.
అందులో హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి.. మెదక్.. నల్గొండ.. మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఐదుజిల్లాలు కాస్తా ఏడుజిల్లాలుగా మారాయి. హెచ్ఎండీఏ పరిధిని విస్తరించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం.. జీహెచ్ఎంసీ పరిధిని కూడా ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించనుంది. దాదాపు 2 వేల చదరపుకిలోమీటర్ల వరకు జీహెచ్ఎంసీ పరిధి పెరగనుంది. ఈ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు 33 గ్రామ పంచాయితీలు.. 27 మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లు ఉండగా.. వాటన్నింటినీ కోర్ అర్బన్ ఏరియాగా నిర్ధారించి డెవలప్ చేసేలా ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా డెవలప్ మెంట్ కు పెద్ద ఎత్తున చేపడుతూ.. రియల్ ఎస్టేట్ జోరు మరింత పెరిగేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పాలి.