రాజధాని అమరావతి కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం చేస్తారా ? ఇదో ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే రాజధాని అమరావతికి అనుకూలంగాను వ్యతిరేకంగాను చాలా కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. మొత్తంమీద రాజధాని వివాదంపై సుమారు 144 కేసులు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు రోజువారి విచారాణకు రెడీ అయ్యింది. ఈ నేపధ్యంలోనే విజయవాడకు చెందిన లా స్టూడెంట్ వేమూరు లీలాకృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లీలాకృష్ణ బెనారస్ యూనివర్సిటిలో లా చదువుతున్నారు.
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కేసు కాబట్టి అమరావతి రాజధాని విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలంటూ ఈ విద్యార్ధి హైకోర్టును అభ్యర్ధించారు. విచారణ జరుగుతున్నపుడు ప్రభుత్వ వాదనేంటి, ప్రతిపక్షాలు, ప్రత్యర్ధుల వాదనేంటి అనే విషయాలను తెలుసుకోవాలని జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉందని లీలాకృష్ణ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి వాద ప్రతివాదనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే అందరూ నేరుగా చూసే అవకాశం ఉంటుందన్నారు. లీలాకృష్ణ అభ్యర్ధను కోర్టు సానుకూలంగా స్పందించే అవకాశం కూడా ఉందనే ప్రచారం మొదలైంది.
ఎందుకంటే ఇఫ్పటికే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తమ నియోజకవర్గ ప్రతినిధి అసెంబ్లీలో ఏ విధంగా సమస్యలను ప్రస్తావిస్తున్నారనే విషయాన్ని ప్రజలందరు గమనిస్తున్నారు. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన, వాగ్ధాటి, సమస్యలను ప్రస్తావించే విధానం తదితరాలను జనాలందరు చూస్తున్నారు. కాబట్టి ఇదే పద్దతిలో కోర్టులో జరిగే వాద ప్రతివాదనలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఈ విద్యార్ధి భావించినట్లుంది. అందుకనే హైకోర్టులో ఓ పిటీషన్ వేశారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates