నితిన్ గడ్కరీ… కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిగా పదేళ్లకుపైగా కొనసాగుతున్నారు. మోదీ కేబినెట్ లో ఆ శాఖను గడ్కరీ తప్పించి ఇతర నేత చేపట్టనే లేదు. బీజేపీలో ఓ సీనియర్ మోస్ట్ నేతగానే కాకుండా… దేశ అభివృద్ధి విషయంలో ప్రత్యేకించి రోడ్డు రవాణా అభివృద్ధి విషయంలో గడ్కరీకి ఉన్నంత విజన్ మరే నేతకు లేదనే చెప్పాలి.
ఫలితంగానే గడ్కరీ హయాంలో దేశంలో జాతీయ రహదారుల వృద్ధి పరుగులు పెడుతోంది. ఏ ప్రాంతంలో ఏ రహదారి అవసరం?… ఏ స్థాయి రహదారితో ఏ మేర అభివృద్ధి సాధ్యం అన్న విషయంపై గడ్కరీకి సంపూర్ణ అవగాహన ఉంది.
యావత్తు దేశం రహదారుల లెక్కలన్నీ అలా అలా నోటితోనే చెప్పేయగల గడ్కరీ…ఎందుకనో గానీ ఏపీ రాజధాని అమరావతి విషయంలో మాత్రం శీతకన్ను వేసినట్టే కనిపిస్తోంది. అమరావతి అనేది ఫ్యూచర్ సిటీ. రానున్న ఐదేళ్లలోనే ఏపీ రూపు రేఖలను మార్చేసేలా ఓ భారీ సిటీగా అవతరించనుంది.
ఇటు విజయవాడ, అటు గుంటూరు… ఆపై తెనాలి, మంగళగిరిలను తనలో కలిపేసుకుని… ఇప్పుడున్న మహా నగరాల కంటే ఓ నాలుగైదు రెట్ల మేర పెద్దదైన నగరంగా రూపాంతరం చెందనుంది.
అలాంటి నగరం చుట్టూ ప్రతిపాదించే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎలా ఉండాలి? ఈ విషయంలో నిజంగానే గడ్కరీకి ఒకరి సలహాలు అక్కర్లేదు. అయినా కూడా అమరావతి ఒఆర్ఆర్ వెడల్పు 70 మీటర్లు సరిపోతుందంటూ ఆయన మంత్రిత్వ శాఖ ఓ తీర్మానానికి వచ్చేసింది.
గడ్కరీ శాఖ తీర్మానం ముమ్మాటికీ రాంగేనని చెప్పక తప్పదు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు, ఇటీవలే ఉత్తరప్రదేశ్ సహా ఇతర ఉత్తరాది నగరాల చుట్టూ నిర్మితమైన రహదారులను చూస్తే.. అమరావతిని గడ్కరీ శాఖ చాలా తక్కువ అంచనా వేసింది. అమరావతి చుట్టూ నిర్మితమయ్యే ఓఆర్ఆర్ వెడల్పు హీన పక్షం 150 మీటర్లు ఉండాల్సిందే.
ఎందుకంటే… భవిష్యత్తులో దీనిపై ఏ ఒక్కరూ ఊహించనంత మేర ట్రాఫిక్ నమోదు కానుంది. ప్రస్తుతానికి నాలుగు లేన్లతోనే నిర్మితం అవుతున్నా… అతి తక్కువ కాలంలోనే దీనిని ఆరు, ఎనిమిది, పది లేన్లకు విస్తరించక తప్పదు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం మాత్రం 70 మీటర్ల నిడివి సరిపోతుందంటూ చెబుతోంది.
ఇదిలా ఉంటే… ఓఆర్ఆర్ చుట్లూ చాలా గ్రామాలు ఉన్నాయి. వాటికి అవసరమైన మేర సర్వీస్ రోడ్లను కేంద్రం తన ప్రతిపాదనల్లో అసలు ప్రస్తావించనే లేదు. అంటే… ఓఆర్ఆర్ పక్కన ఉండే గ్రామాల ప్రజలు అమరావతిలోకి ప్రవేశించాలంలే… నానా కష్టాలు పడాల్సిందే.
అయినా జాతీయ రహదారుల వెంటే ప్రతి గ్రామం వద్ద సర్వీస్ రోడ్లు ఉంటుంటే… ఓఆర్ఆర్ గ్రామాలకు సర్వీస్ రోడ్లు లేకపోతే ఎలా? ఇక ఇప్పటికీ 70 మీటర్ల వెడల్పు మేరకే భూసేకరణ చేస్తే… భవిష్యత్తులో దాని విస్తరణకు భూసేకరణకు కనీసం 15 రెట్ల మేర నిధులను ఖర్చు పెట్టక తప్పదు కదా.
ఈ అంశాలన్నీ గడ్కరీ తెలియనివి కావు. అందుకే… అమరావతి ఓఆర్ఆర్ పై గడ్కరీ మంత్రిత్వ శాఖ మరోమారు ఆలోచన చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates