వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే రావడం లేదు. ఇది కోర్టులో ఉన్న వ్యవహారం. పైగా.. కూటమి సర్కారు కూడా దీనిని లైట్ తీసుకుంది. ప్రజలు ఇవ్వనప్పుడు తాము మాత్రం ఎలా ఇస్తామని.. కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ పరిస్థితి డోలాయమానంలో పడింది. దీంతో అందివచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు.
గతంలో వరదల సమయంలో సీఎం చంద్రబాబు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీంతో అప్పటి వరకు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్న జగన్.. అనూహ్యంగా విజయవాడకు వచ్చారు. మోకాల్లోతు నీటిలో పర్యటించి.. సర్కారుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత మరోసారి వచ్చారు. అంతే.. దాంతో సరిపుచ్చారు. అయితే.. అప్పట్లో ఆయన అనుకున్న మైలేజీ అయితే రాలేదు. వరదల వ్యవహారంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్లు చేసినా.. వాటికి కూడా ప్రజల నుంచి స్పందన అయితే ఆశించిన విధంగా రాలేదు.
ఇక, ఇప్పుడు తిరుపతి వ్యవహారం వచ్చింది. ఈ విషయంలోనూ కూటమి సర్కారు హుటాహుటిన స్పందించింది. ఎవరూ డిమాండ్ చేయకుండాను రూ.25 లక్షలను పరిహారంగా ప్రకటించింది. అంతేకాదు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లు కూడా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇది కొంత వరకు వేడిని తగ్గించిందనే చెప్పాలి. అయితే.. ఈ వేడిని ఇలాంటి ఘటనలనే సహజంగా ప్రతిపక్షాలు కోరుకుంటాయి కాబట్టి.. ఈ సమయంలోనే జగన్ స్పందించారు.
తానే నేరుగా రంగంలోకి వచ్చేశారు. వచ్చీరావడంతోనే ఆయన పరామర్శలకంటే కూడా.. విమర్శలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ పరిణామం జగన్‌కు మార్కులు తెచ్చింది లేదా? అనేది పక్కన పెడితే.. ప్రధాన ప్రతిపక్షం కోసం.. ఆయన పడుతున్న ఆరాటాన్ని మాత్రం స్పష్టం చేసిందని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయంగా కంటే కూడా.. మానవత్వంతో వ్యవహరించి ఉంటే బాగుండేదన్న సూచనలు వచ్చాయి. ఏదేమైనా ప్రధాన ప్రతిపక్షం కోసం జగన్ పోరాటమే కాదు.. ఆరాటం కూడా పడుతున్నారన్నది స్పస్టంగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates