తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రభుత్వం తరఫున బహిరంగ క్షమాపణలు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక, టీటీడీ బోర్డు సభ్యులు.. బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి.. సారీ చెప్పాలని, పరిహారం ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పవన్ కల్యాణ్ మాట నెరవేర్చేందుకు రెడీ అయింది. శనివారం ఉదయం లేదా సాయంత్రం పాలక మండలి సభ్యులు బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఇప్పటికే ప్రకటించిన పరిహారం తో పాటు.. టీటీడీ తరఫున కూడా పరిహారం ప్రకటించి.. దీనిని స్వయంగా పాలక మండలి సభ్యులు మృతి చెందిన వారి కుటుంబాలకు అందించనున్నారు. అదేవిధంగా సారీ కూడా చెప్పనున్నారు.
ఇక, ఈ తొక్కిసలాటలో గాయపడిన వారికి కూడా ఇళ్లకు వెళ్లి పరిహారం అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. వారిని కూడా ఊరడించే ప్రయత్నం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం పాలక మండలి ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలో పాలక మండలి నుంచి నలుగురు, అధికారులు ఇద్దరిని ఎంపిక చేసి బాధితుల ఇళ్లకు పంపించేందుకు చొరవ తీసుకోను న్నారు. తద్వారా జరిగిన ఘటనకు ఈ దశలో ఎండ్ కార్డు వేయనున్నారని సమాచారం.