డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. వారికి సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. కార్యాకారణ సంబంధంతో నిమిత్తం లేకుండానే.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ప్రోగ్రామ్స్‌కు రావడం.. చిరాకు తెప్పించడం సహజంగా మారిపోయింది. దీంతో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో బాధితులను పరామర్శించేందుకు శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన కేంద్రానికి వచ్చిన ఆయనను అభిమానులు చుట్టుముట్టారు. కార్యకర్తలు, సినీ అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి.. కారును ముందుకు కదలించలేదు. అదేసమయంలో వీడియోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మరికొందరు సీఎం-సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇంకొందరు.. ఓజీ-ఓజీ అంటూ నినదించారు. దీంతో పవన్‌కు చిర్రెత్తుకొచ్చింది.
దీంతో సంయమనం కోల్పోయిన పవన్ కల్యాణ్.. అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో “మనుషులు చనిపోయారు. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా..? మీకు బాధలేదా?. కొంత కూడా బాధ్యతలేకపోతే ఎలా” అని మండిపడ్డారు. అంతేకాదు.. వాళ్లను పక్కకు తప్పించండి అని పదే పదే పోలీసులకు సూచించారు.
అయినప్పటికీ అభిమానులు తప్పుకోకపోవడంతో పవన్ మరింత బిగ్గరగా.. అభిమానులను ఉద్దేశించి.. కొంచెమైనా.. ఆలోచన ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను అక్కడ నుంచి పంపించారు. అయితే.. సమయం సందర్భం లేకుండా.. ఇలా పవన్ అభిమానులు యాగీ చేయడం ఇదే తొలిసారి కాదు.. ఇటీవల కడపలో ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించేందుకు పర్యటించినప్పుడు కూడా ఆయనను ఇబ్బంది పెట్టారు. దీంతో అప్పట్లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు.