ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఏపీ, ఒడిశాలో పర్యటించనున్నారు. తొలుత విశాఖకు వచ్చిన ఆయన బుధవారం రాత్రి ఇక్కడే ఉండి.. గురువారం ఉదయం ఒడిశాకు వెళ్లనున్నారు. కాగా, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..తొలిసారి విశాఖకు వచ్చిన ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా.. పలువురి నుంచి ఘన స్వాగతం లభించింది. విశాఖ విమానాశ్రయం చేరుకున్న అనంతరం.. సిరిపురం జంక్షన్ నుంచి సభ జరిగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ వరకురోడ్ షో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత రోడ్ షో ద్వారా ఆయన సభా స్థలికి చేరుకున్నారు. ఈ రోడ్ షోలో ప్రధాని మోడీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి(వాహనంలో వీరి వెనుక నిలబడ్డారు)కు అవకాశం చిక్కింది. ప్రధానికి కుడి-ఎడమల్లో చంద్రబాబు-పవన్‌కల్యాణ్‌లు నిలబడ్డారు. వీరు ఆసాంతం ప్రధానితో పాటు ఉండి సభా స్థలికి చేరుకున్నారు. దారి పొడవునా అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు. సభ స్థలికి చేరుకునే వరకు.. పవన్ కల్యాణ్, చంద్రబాబు చేతులు ఊపుతూ.. నమస్కారాలు చేస్తూ ముందుకు కదిలారు.
ప్రధానికి కుడి పక్కన సీఎం చంద్రబాబు, ఎడమ పక్కన పవన్ కల్యాణ్‌లు నిలబడ్డారు. ఇక, భారీ ఎత్తున వచ్చిన ప్రజలు పూలు జల్లుతూ తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. రెండు అంచల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడం తో ప్రధానిని చూసేందుకు వచ్చిన ప్రజలు ఒకింత ఇబ్బంది పడ్డారు. రోడ్ షో జరిగిన ప్రాంతంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో తోపులాటలకు అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా గ్యాలరీలలో జానపద కళారూపాలను ప్రదర్శించారు. కొన్ని కొన్ని చోట్ల జనాలు పలచగా కనిపించగా.. మరికొన్ని చోట్ల ప్రజలు గ్యాలరీలలో కిక్కిరిసిపోయారు.
కానుకలు ఇవీ..
విశాఖకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు పలుకానుకలు అందించారు. వేదికపై దుశ్శాలువాతో ఆయనను సత్కరించా రు. అదేవిధంగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌ను అందించారు. అలాగే శేషశయన రూపంలో ఉన్న శ్రీహరి విగ్రహాన్ని కూడా బహూకరిం చారు. సభా వేదికపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.. ఆహ్వానం పలికారు. అయితే.. ఆయన కొద్ది సేపు హిందీలో మాట్లాడే ప్రయత్నం చేసి.. తడబడ్డారు. అనంతరం.. మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. తర్వాత.. పవన్ కల్యాణ్ .. ప్రసంగించారు.