టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అనూహ్యంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. వరుసగా మూడు రోజుల పాటు ఆయన తన నియోజకవర్గానికి కేటాయించడం చర్చనీయాంశం. సాధారణంగా ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం గురించి పట్టించుకోవడం తప్పుకాదు. కానీ, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు ఇలా.. తొలినాళ్లలోనే తన నియోజకవర్గంలో మూడు రోజులు తిష్ఠవేసి మరీ.. ప్రజలతో మమేకం కావడం వెనుక ఖచ్చితంగా రీజన్ ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
1) నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు. 2) స్థానికంగా జరుగుతున్న రాజకీయ మార్పులు. ఈ రెండు కారణంగానే చంద్రబాబు అనూహ్యంగా ఇక్కడ పర్యటించారు. భారీ ఎత్తున ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. నిజానికి వారం రోజుల కిందటే సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. పలు మండలాల్లో పర్యటించి.. అనేక కార్యక్రమాలకు ఆమె కూడా శ్రీకారం చుట్టారు. ఇలా.. భార్య, భర్త కేవలం వారం వ్యవధిలోనే తమ నియోజకవర్గంలో పర్యటించడం చర్చకు దారితీసింది.
ప్రస్తుతం నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. ఆధిపత్య పోరు సాగుతోంది. కీలక నాయకులకు – క్షేత్రస్థాయిలో నాయకులకు కూడా పడడంలేదు. గతంలోనూ ఈ సమస్య వచ్చింది. ఇదే.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చిందన్న ప్రచారం ఉంది. అందుకే ఇప్పుడు మాత్రం చంద్రబాబు అలెర్టు అయ్యారు. అందుకే.. ఆయన నేరుగా జోక్యం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పైకి ఏమీ మాట్లాడక పోయినా.. తనే స్వయంగా తన నియోజకవర్గం సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్న నమ్మకం వచ్చేలా చేశారు.
ఇక, నారా భువనేశ్వరి కూడా వారం కిందట మూడు రోజుల పాటు నియోజకవర్గంలో కలియదిరిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ఆమె పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించికూడా.. పథకాలను అమలు చేయనున్నట్టు తేల్చారు. ఒకరకంగా చెప్పాలంటే.. గతానికి ఇప్పటికి మధ్య స్థానికంగా జరుగుతున్న రాజకీయ మార్పులు సరిదిద్దడంతోపాటు.. ప్రస్తుతం రాజకీయంగా వస్తున్న మార్పులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నంగానే పరిశీలకులు చెబుతున్నారు.