2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాకుండా.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనేక మంది నాయకుల తలరాతలను ఈ ఏడాది మార్చేసింది. కొందరికి కోరి కోరి పగ్గాలు ఎదురేగితే.. మరికొందరికి చివరి నిమిషాల్లో ఆశలను కబళించేసిన సంవత్సరం కూడా ఇదే కావడం గమనార్హం. అనేక మంది ఈ సంవత్సరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే.. చివరి నిముషంలో టికెట్లు దక్కక ఈసురోమన్న నాయకులు కూడా ఉన్నారు. వీరికైనా.. వారికైనా 2024 కొత్తపాఠాలనే నేర్పించిందని చెప్పాలి.
గట్టి పట్టుదలతో గెలిచేందుకు ప్రయత్నించిన పిఠాపురం టీడీపీ నాయకులు వర్మకు చివరి నిమిషంలో ఆశాభంగమైతే.. ఇదే నియోజకవర్గం నుంచి చివరి నిముషంలో బరిలోకి దిగిన పవన్ కల్యాణ్ జయకేతనం ఎగురవేశారు. అదేవిధంగా చివరి నిముషం వరకు.. టికెట్ ప్రకటించకపోవడంతో తీవ్ర తర్జన భర్జనకు గురైన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రాధాకృష్ణలకు కూడా.. 2024 ఒక జ్ఞాపకంగానే కాకుండా.. పాఠంగా కూడా నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎలా ఉందో చూసేందుకు వచ్చిన గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌కు అనూహ్య రీతిలో టికెట్ దక్కింది.
ఆయనకు కూడా 2024 ఒక మధుర జ్ఞాపకమే. ఇక, తనకు ఇక్కడ కాకపోతే.. మరోచోట అయినా.. టికెట్ ఖాయమని అనుకున్న దేవినేని ఉమా.. నిరాశకు గురైంది కూడా ఈ ఏడాదే. అదవిధంగా సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన అనేక మంది నాయకు లు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. తమ గెలుపు రాసిపెట్టుకోవాలని శపథాలు చేసిన రోజా, అంబటి రాంబాబు వంటివారిని ఈ ఏడాది మట్టి కరిపించింది. తమకు 30 ఏళ్లపాటు తిరుగులేని విజయం దక్కుతుందని.. పాలన తమదేనని భావించిన జగన్ కూడా బొక్కబోర్లా పడింది.. 2024లోనే.
వీరు మాత్రమే కాదు.. అతిరథులను తీసుకుంటే.. మహిళా సెంటిమెంటుతో విజయం కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ చీఫ్ షర్మిల నుంచి ‘ఈ ఒక్క సారే’ అంటూ.. సెంటిమెంటు పండించిన ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వరకు అనేక మంది తమ తమ నియోజకవర్గా ల్లో ఓటమి చవిచూశారు. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు.. అనేందుకు 2024 ప్రబల ఉదాహరణగా నిలిచింది. రాజకీయం గా అనేక ఉత్థాన పతనాలను ప్రజలకు చూపించింది. రాజకీయాల్లో ఎలా ఉండాలో నాయకులకు నేర్పించింది. ఎలా ఉండకూడదో కూడా అనేక పాఠాలు చెప్పింది. వారు-వీరు అనే తేడా లేకుండా.. 2024లో అందరూ అనేక పాఠాలు నేర్చుకున్నారనడంలో సందేహం లేదు.