బీజేపీలోకి వైసీపీ నేత‌.. మంత‌నాలు షురూ!

ఏమాటకామాటే చెప్పుకొవాలి. రెడ్డి సామాజిక వ‌ర్గం అంటే.. చెవులు కోసుకునే నాయ‌కుల్లో చాలా మంది మాటేమో కానీ.. గుంటూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన మోదుగుల వేణుగోపాల రెడ్డి.. మ‌న‌సు మారింద‌ని అంటున్నారు జిల్లాకు చెందిన రాజ‌కీయ పండితులు.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌గా సుప‌రిచితులైన మోదుగుల‌కు మిగిలిన రెడ్ల కంటే కూడా రెడ్డి సామాజిక వ‌ర్గంపై ఎన‌లేని మ‌క్కువ‌. అయినా.. ఆయ‌న రాజ‌కీయాలు టీడీపీతో ప్రారంభించారు. 2009లో గుంటూరు జిల్లా న‌రసారావు పేట పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసిన ఆయ‌న విజ‌యం సాధించారు. అయితే, అప్ప‌ట్లో కాంగ్రెస్ నేత‌ల‌తో ఆయ‌న సంబంధాలు కొన‌సాగించార‌నే పేరుంది.

ఇక‌, 2014లో మ‌ళ్లీ పేట నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నా.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టీడీపీలోకి రావ‌డంతో మోదుగుల‌కు గుంటూరు వెస్ట్ టికెట్ ఇచ్చారు చంద్ర‌బాబు. అయితే, ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా వెళ్ల‌డం ఇష్టం లేక‌పోయినా.. అప్ప‌ట్లో జ‌గ‌న్‌కు చెక్ పెట్టే ఉద్దేశంతో మోదుగుల‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని బాబు హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. స‌రే.. ఆయ‌న వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. తీరా.. మ‌ళ్లీ ఎన్నికల నాటికి కూడా మోదుగు‌ల‌నుబాబు ప‌ట్టించుకోలేదు. దీంతో అల‌క‌పూనిన ఆయ‌న రాష్ట్రంలో రెడ్డి సామాజిక వ‌ర్గం అధికారంలోకి వ‌స్తే.. త‌ప్ప‌. మ‌న‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని పేర్కొంటూ.. నేరుగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ క్ర‌మంలోనే గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టుబ‌ట్టి సాధించి పోటీ చేశారు. అయితే.. ఇక్క‌డ ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న రెండు ప‌ద‌వులు ఆశించారు. ఒక‌టి రాజ్య‌స‌భ‌, రెండు ఎమ్మెల్సీ. ఈ రెండు కూడా ద‌క్క‌లేదు. దీంతో తీవ్ర అస‌హ‌నంతో వేణుగోపాల్‌రెడ్డి ఉడికిపోతున్నార‌నేది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇక‌, పార్టీలో ఉండ‌డం వేస్ట్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. ఇదిలావుంటే, గుంటూరు వంటి కీల‌క జిల్లాలో బీజేపీ పావులు క‌దుపుతోంది. మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఏపీలో పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీ.. ఈ క్ర‌మంలోనే సామాజిక వ‌ర్గాల వారిగా ఇక్క‌డ చ‌క్రం తిప్పుతోంది.

ప్ర‌స్తుతం జిల్లాల వారీగా.. సామాజిక వ‌ర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిసైడ్ అయిన జాతీయ నాయ‌క‌త్వం.. ఇప్ప‌టికే క‌మ్మ‌ల‌ను పార్టీలోకి తీసుకున్నారు. వారిలో కొంద‌రికి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. ఇక‌, కాపు నేత‌ల‌కు కూడా రాష్ట్రంలో రెండు సార్లు.. పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఇప్పుడు రెడ్డి వ‌ర్గంపై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అసంతృప్తితో ఉన్న రెడ్డి వ‌ర్గాన్ని త‌న‌వైపున‌కు తిప్పుకొనేలా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ద్వారా మోదుగుల‌తో మంత‌నాలు చేయిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో మోదుగుల కూడా సోముతో మాట్లాడిన‌ట్టు స‌మాచారం. అయితే, పార్టీ మారేదీ లేనిదీ.. ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని, త‌న అంచ‌నాల విష‌యంలో బీజేపీ సానుకూలంగా స్పందిస్తే.. మారే ఛాన్స్ ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గుంటూరు రెడ్డిగారి నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాల‌ని అంటున్నారు జిల్లా రాజ‌కీయ ప‌రిశీల‌కులు.