తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది.
తాజాగా జరిగిన విచారణలో, కోర్టు కేటీఆర్‌పై ఎలాంటి అరెస్టు చర్యలు తీసుకోకూడదని ఏసీబీని ఆదేశించింది. గతంలోనూ కోర్టు కేటీఆర్‌ను అరెస్ట్ చేయరాదంటూ డిసెంబర్ 21న మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణ మరింత సవివరంగా జరగాల్సి ఉందని కోర్టు విచారణను డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేసింది.
కేసు వివరణలో ఏసీబీ కీలకంగా స్పందించింది. కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ కోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదనే ఆదేశాలను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. విచారణ కొనసాగుతోన్న ఈ దశలో, కేటీఆర్‌కు మంజూరైన రిలీఫ్ విచారణకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఏసీబీ అభిప్రాయపడింది.
కేటీఆర్ అరెస్టు విషయంలో హైకోర్టు మరోసారి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు విచారణను కొంతకాలం నిలిపి పెట్టినా, కోర్టు తుది నిర్ణయం మరింత ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఈ కేసు పరిణామాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.