వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పక్కన పెట్టిన ఫలితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజల చేతి చమురు బాగానే వదులుతోంది. ఇటీవలే.. రాజధాని ప్రాంతంలో ఏపుగా పెరిగి.. అడవిని తలపించిన.. పిచ్చి మొక్కలు, తుమ్మ మొక్కలను తొలగించేందుకు రూ.32 కోట్లను కూటమి సర్కారు ఖర్చు చేసింది.
ఇక, ఇప్పుడు మరో తంటా ముందుకు వచ్చింది. కీలకమైన హైకోర్టు, శాసన సభ, సచివాలయం, నవ నగరాలకు సంబంధించిన శాశ్వత కట్టడాలకు .. వేసిన పునాదులు దాదాపు 20 అడుగుల మేరకు నీటితో నిండిపోయాయి. ఇలా.. గత ఐదేళ్లుగా నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడు వీటిలో నుంచి నీటిని తోడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి నిర్వహించి మౌఖిక కాంట్రాక్టు మేరకు నెల్లూరుకు చెందిన కీలక నాయకుడు దీనిని దక్కించుకున్నారు.
సుమారు నాలుగు ప్రధాన ర్యాఫ్ట్ ఫౌండేషన్‌లలో 20 అడుగుల(8 మీటర్లు) మేరకు చేరుకున్న నీటిని తోడి.. రెండు గ్రామాల ఆవల ఉన్న కృష్ణానదిలోకి పంపించేందుకు.. భారీ స్థాయి జనరేటర్లను రంగంలోకి దింపారు. వీటికి సుమారు 2 వేల లీటర్లపైనే డీజిల్ ఖర్చవుతుందని కాంట్రాక్టర్ తెలిపారు. ఇక, ఆయా గ్రామాల ద్వారా ప్లాస్టిక్ పైపులు వేసి.. కృష్నానదిలోకి నీటిని పంపించేందుకు కొన్ని వేల ప్లాస్టిక్ పైపులు కొనుగోలు చేయాలి. 200 మంది కార్మికులను వాడాలి. 8-10 రోజులు పనిచేయాల్సి ఉంటుంది.
ఇలా.. మొత్తంగా 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. దీనిని ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే.. వైసీపీ హయాంలో జగన్ కనీసం నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఖర్చు మిగిలి ఉండేదని రైతులు చెబుతున్నారు.