సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు , కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. మెజారిటీ నాయకులు.. తమ సమస్య మొత్తానికి కారకులుగా .. పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే వేళ్లు చూపించారు. తమకు కనీసం గౌరవం కూడా.. ఇవ్వకుండా.. ఐదేళ్లపాటు పార్టీ ప్రధాన కార్యాలయానికి కూడా రానివ్వలేదని తెలిపారు.
అంతేకాదు.. కార్పొరేషన్ సహా.. జిల్లా రాజకీయాల్లో సజ్జల షాడో నాయకుల ద్వారా చక్రం తిప్పుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని వారు పేర్కొన్నారు. అయితే.. అన్నీ సర్దుకుంటాయని.. తాను ఉన్నానని జగన్ భరోసా ఇచ్చారు. కానీ.. మెజారిటీ నాయకులు మాత్రం ఎవరూ వినిపించుకునే ప్రయత్నం చేయలేదని తెలిసింది. తమకు విలువ లేకుండా చేసిన సజ్జలకే ఇంకా ప్రాధాన్యం ఏంటని.. కీలక మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రశ్నించారు.
సొంత జిల్లాలో ఆయన ఏ వార్డు నుంచి కూడా విజయం దక్కించుకున్న నాయకుడు కాదని.. తాను మాత్రం.. తన తండ్రి హయాం నుంచి నియోజకవర్గంలో విజయం దక్కించుకుంటున్నానని..అలాంటి తనకే విలువలేకుండా.. పోయిందని.. దీనికి కారణం సజ్జలేనని చెప్పుకొచ్చారు. ఇక, కార్పొరేషన్ మేయర్ కూడా.. ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సజ్జల చుట్టూ చేరిన కోటరీ కారణంగానే.. ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని ఒకరిద్దరు చెప్పారు.
మిగిలిన వారు.. పార్టీ కోసం ఏం చేయమన్నా చేస్తామని.. కానీ, సజ్జలను మాత్రం పార్టీ నుంచి తప్పించాలన్న ప్రధాన డిమాండ్ వినిపించడం గమనార్హం. అయితే.. అన్ని విషయాలను సౌమ్యంగా విన్న జగన్.. తనకు అన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయని.. త్వరలోనే మార్పును చూస్తారని వారికి హామీ ఇచ్చారు. ప్రతి విషయాన్నీ తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ప్రభుత్వంపై పోరాటానికి అందరూ కలిసి రావాలని.. ఈ నెల 27న పెట్టుకున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్టు తెలిసింది.